అధికారంలోకి వచ్చినప్పటినుంచి మోడీ ప్రభుత్వం ఏదో ఒక కొత్త పథకాన్ని తెరపైకి తేవటమో లేక ఉన్న పథకాలకు పేర్లుమార్చటమో చేస్తోందన్నది జగమెరిగిన సత్యం. నిధుల కొరతతో ఎంఫిల్, పీహెచ్‌డీ చేసే ఓబీసీ పరిశోధకులకు ఇచ్చే ఫెలోషిప్‌లు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో ఆ వర్గాల పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 2014లో ఓబీసీకి ఎంఫీల్, పీహెచ్‌డీ స్కాలర్‌లకు సహాయం చేయడానికి స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రారంభించింది. కానీ స్టైఫండ్‌లలో జాప్యం పెరుగుతోంది.
మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యాయని స్కాలర్లు ఆరోపిస్తున్నారు. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వెనుక బడిన తరగతులకు చెంది జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌కు అర్హత సాధించిన 1,000 మంది కొత్త స్కాలర్‌లకు జాతీయ ఫెలోషిప్ (ఎన్‌ఎఫ్‌ఓబీసీ) ఇస్తుంది. వీరిలో 75 శాతం మంది సామజిక శాస్త్రాల నేపథ్యం ఉన్నవారై ఉంటారు. మిగిలిన వారు సైన్స్ స్కాలర్లుగా ఉంటారు.
ఈ పథకంలో ఇంటిగ్రేటెడ్ ఎంఫీల్, పీహెచ్‌డీ అభ్యసించే విద్యార్థులకు ఐదేండ్ల ఫెలోషిప్, ఇతర ప్రోగ్రామ్‌ల కోసం రెండేండ్ల ఫెలోషిప్ ఉంటుంది. స్టైఫండ్ నెలవారీగా యూజీసీ ప్రమాణాలకు సమానంగా ఉంటుంది. అయితే ఓబీసీ ఓఠ్లకు గాలం వేస్తున్న ప్రభుత్వ ఈ సంవత్సరం ఈ మొత్తాన్ని నెలకు రూ. 37,000కి పెంచింది. కానీ ఇవ్వటం లేదని, బకాయిలు పేరుకుపోతున్నాయని విద్యార్థులు పేర్కొంటున్నారు.