చైనాలో నుమోనియా కేసులు అలజడి సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. దాదాపు ఆరు రాష్ట్రాల్లో హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అలర్ట్‌లో పెట్టారు. చైనాలోని పిల్లల్లో శ్వాసకోస వ్యాధులు వ్యాపిస్తున్నాయి. రాజస్థాన్, కర్నాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాస్పిటళ్లను సిద్ధం చేశారు. హెల్త్ కేర్ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆరోగ్యశాఖ రెడీగా ఉంది.
కర్నాటక ఆరోగ్యశాఖ రాష్ట్ర ప్రజలకు వార్నింగ్ ఇచ్చింది. సీజనల్ ఫ్లూ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. సీజనల్ ఫ్లూ లక్షణాలు, రిస్క్ గురించి ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా లేకున్నా.. మెడికల్ సిబ్బంది మాత్రం అప్రమత్తంగా ఉండాలని రాజస్థాన్ ఆరోగ్యశాఖ అడ్వైజరీ జారీ చేసింది. కోవిడ్ వేళ ఏర్పాటు చేసిన మౌళికసదుపాయాల్ని ఇప్పుడు మళ్లీ బలోపేతం చేయనున్నట్లు గుజరాత్ మంత్రి రుషికేశ్ పటేల్ తెలిపారు.
శ్వాసకోశ కేసులపై నిఘా పెట్టాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం పేర్కొన్నది. ఉత్తరాఖండ్‌లోని చమోలీ, ఉత్తరకాశీ, పిత్తోర్‌ఘర్ జిల్లాలు చైనాతో బోర్డర్‌లో ఉన్నాయి. పబ్లిక్, ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదు అవుతున్న రెస్పిరేటరీ కేసులు డేటా ఇవ్వాలని హర్యానా సర్కార్ ఆదేశాలు ఇచ్చింది.