గాజాలో శాశ్వత కాల్పుల విరమణ కోసం జరుగుతున్న చర్చలు, ప్రయత్నాలు ఆచరణాత్మక దశకు చేరుకున్నాయని భావిస్తున్నారు. మధ్యవర్తిత్వం వహిస్తున్న వివిధ పక్షాలు ముమ్మరంగా చర్చలు జరుపుతున్నాయి. ఇజ్రాయిల్‌తో పోరులో విరామాన్ని పొడిగించేందుకు హమస్ సుముఖంగానే వుంది. కాగా, తాజా బందీలు, ఖైదీల విడుదల్లో భాగంగా ఇజ్రాయిల్ జైళ్ళ నుండి 30మంది పాలస్తీనియన్లు, పిల్లలు విడుదల కాగా, పది మంది ఇజ్రాయిలీలను, ఇరువురు విదేశీ జాతీయులను హమస్ విడుదల చేసింది. పలువురు రష్యన్ బందీలు బుధవారం విడుదలయ్యే అవకాశం వుందని హమస్ అధికారులు తెలిపారు.
కాగా బ్రస్సెల్స్‌లో పత్రికా సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ, కాల్పుల విరమణను పొడిగించేందుకు చేయాల్సిందంతా చేస్తున్నామని చెప్పారు. ఈ ఘర్షణలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా వుండేందుకు, గాజా నుండి అమెరికన్లు సహా ఇతర విదేశీ జాతీయులందరూ సురక్షితంగా బయటపడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరోవైపు హమస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు ఘాజి హమద్ మాట్లాడుతూ, కాల్పుల విరమణ పొడిగింపు కోసం హమస్ తీవ్రంగా కృషి చేస్తోందని చెప్పారు. సద్దుబాటు కోసం మధ్యవర్తిత్వం జరుపుతున్న ఇతర దేశాలతో కలిసి పనిచేస్తోందన్నారు. కాల్పుల విరమణను పొడిగిస్తే మరింత మంది బందీలను విడుదల చేసేందుకు సిద్ధంగా వున్నమన్నారు. కతార్, ఈజిప్ట్‌ల్లోని తమ సోదరులతో నిత్యం సంబంధాలను కలిగివున్నామని చెప్పారు.