టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన చంద్రబాబుకు టీడీపీ, జనసేన శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ముందుగా రేణిగుంట విమానాశ్రయం దగ్గర స్వాగతం పలకగా.. అక్కడి నుంచి బయల్దేరి తిరుపతి చేరుకున్నారు. చంద్రబాబు అభిమానులకు అభివాదం చేసి ఆప్యాయంగా పలకరించారు. అక్కడి నుంచి అలిపిరి మీదుగా రాత్రి 7 గంటలకు తిరుమలకు చేరుకున్నారు. చంద్రబాబుకు గాయత్రి సదన్ దగ్గర డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు దంపతులు వరాహ స్వామిని దర్శించుకున్నారు. చంద్రబాబు కాన్వాయ్ కొండపైకి చేరుకోకముందు తెలుగుదేశం నేతలు, పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఎక్కువమంది నాయకులు రావడంపై వారు అభ్యంతరం తెలిపారు. జాబితాలో ఉన్నవారినే అనుమతి ఇస్తామని చెప్పడంతో వివాదం మొదలైంది. మాజీమంత్రి అమరనాథరెడ్డి జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది.
అయితే చంద్రబాబు తిరుమలలో శ్రీ వరాహ స్వామి వారిని దర్శించుకున్న సమయంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. భక్తులు జై చంద్రబాబు అంటుంటే.. ఇది పవిత్ర తిరుమల, గోవింద నామస్మరణ మాత్రమే చేయాలని చంద్రబాబు సైగలు చేశారు. దీంతో భక్తులు ఆ నినాదాలను ఆపేసి.. గోవింద నామ స్మరణ చేశారు. చంద్రబాబు భక్తుల్ని ఆప్యాయంగా పలకరించారు. చంద్రబాబు గురువారం రాత్రి తిరుమలలోనే బస చేసి శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సతీమణి నారా భువనేశ్వరితో కలిసి స్వామి వారి దర్శించుకుని ఆశీస్సులు అందుకోనున్నారు. అక్కడి నుంచి బయల్దేరి అమరావతికి వెళ్లనున్నారు. చంద్రబాబు ఈ నెల 2న విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. ఆదివారం(3న) రోజు సింహాచలం వెళ్లి అప్పన్న స్వామి దర్శనం చేసుకుంటారు. డిసెంబర్ 5న శ్రీశైలం మల్లన్న దర్శనానికి చంద్రబాబు వెళ్తారు. ఆ తర్వాత నుంచి మరోసారి జిల్లాల పర్యటనకు వెళ్లేందకు సిద్ధమవుతున్నారు. భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.