ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ సిల్క్యారా సొరంగం నుంచి 41 మంది కార్మికులు 17 రోజుల తర్వాత సురక్షితంగా బయటపడిన విషయం తెలిసిందే. లోపలి చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటకు వస్తారా? అని వారి కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. అయితే, 41 మంది మృత్యుంజయలుగా బయటపడ్డారు. అయితే, తన కుమారుడి కోసం బెంగపెట్టుకుని, నిరాశకు గురైన ఓ తండ్రి గుండె.. అతడు బయటకు రావడానికి కొద్ది గంటల ముందే ఆగిపోయింది. కొడుకు సొరంగం నుంచి బయటకు వచ్చిన రోజునే ఆయన గుండెపోటుతో కన్నుమూశాడు. ఝార్ఖండ్‌లోని ఈస్ట్ సింగ్భమ్ జిల్లా దుమారియా బ్లాక్ బంకిసోల్ పంచాయతీ బహడా గ్రామానికి చెందిన బసేత్ ముర్ము కుమారుడు భక్తు ముర్ము సిల్క్యారా సొరంగ ప్రమాదంలో చిక్కుకున్నాడు. లోపలి చిక్కుకున్న 41 మందిలో తన కొడుకు కూడా ఉండటంతో తండ్రి బసేత్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. నవంబరు 12న కూలిన సొరంగ శిథిలాలలో తన కుమారుడు చిక్కుకుపోయాడని తెలిసినప్పటి నుంచి దిగాలుతో మంచపట్టాడు. మనోవేదనతో మంగళవారం మంచంపై నుంచి కిందపడి గుండెపోటుకు గురయ్యాడు.
బసేత్ పెద్ద కుమారుడు రామ్‌రాయ్ ముర్ము చెన్నైలో పనులు చేస్తుండగా.. చిన్న కొడుకు మంగల్ ముర్ము తమ గ్రామంలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. భక్తు మాత్రం సిల్క్యారా సొరంగంలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రమాదంలో అతడు చిక్కుకున్న విషయం తెలియగానే బసేత్ కుప్పకూలిపోయాడు. రోజులు గడుస్తున్నా బయటకు రాకపోవడంతో అతడి పరిస్థితి దిగజారిపోయింది. చివరకు గుండెపోటుతో మంగళవారం ఉదయం చనిపోయినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. బాసెట్ మరణం గురించి తనకు సమాచారం రాలేదని.. బుధవారం ఉదయం తెలిసిందని ఇన్‌ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సైబా సోరెన్ చెప్పారు. ‘కొన్ని సందర్భాలలో తీవ్రమైన నిరాశ, ఆవేదన అధిక రక్తపోటుకు దారి తీస్తుంది.. ఇది గుండెపోటుకు కారణమవుతుంది... మంచం మీద నుంచి పడిపోయి తలకు గాయమైనా కూడా మరణానికి దారితీస్తుంది. మరణానికి గల కారణాలను పోస్ట్‌మార్టం తర్వాత మాత్రమే చెప్పగలం’ అని డాక్టర్ సోరెన్ పేర్కొన్నారు.