చైనా ఉత్తర ప్రాంతంలోని చిన్నారులు పెద్ద సంఖ్యలో అంతుచిక్కని న్యూమోనియాతో ఆస్పత్రుల్లో చేరుతున్నారనే వార్త యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అక్టోబరు మధ్య నుంచి పెద్ద సంఖ్యలో ఈ రకం కేసులు నమోదవుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. తాజాగా, అమెరికాలోని కొత్తరకం న్యూమోనియా కేసులు నమోదుకావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఒహియో రాష్ట్రంలోని పెద్ద సంఖ్యలో పిల్లలు మిస్టీరియస్ న్యుమోనియాతో బాధపడుతున్నారు. అధిక సంఖ్యలో బాధితులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. దీంతో ఒహియోలో చైనా న్యుమోనియా వ్యాప్తి చెందినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
వారెన్ కౌంటీ ఆరోగ్య అధికారుల ప్రకారం.. ఆగస్టు నుంచి వైట్ లంగ్ సిండ్రోమ్‌గా పిలిచే ఈ వింత వ్యాధికి సంబంధించి 3 నుంచి 14 ఏళ్లలోపు పిల్లల్లో 142 కేసులు నమోదయ్యాయి. ఓహియోలో ఈ సంఖ్య సగటు కంటే ఎక్కువగా ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో పీడియాట్రిక్ న్యుమోనియా కేసులు రోజు రోజుకూపెరుగుతున్నాయి. ఈ వైరస్ సోకిన పిల్లల సగటు వయస్సు ఎనిమిదేళ్లు ఉన్నట్లు ఆరోగ్య శాఖ తాజా నివేదిక పేర్కొంది.
వైట్ లంగ్ సిండ్రోమ్ వైద్యులకు సవాలుగా మారిందని వారెన్ కౌంటీకి చెందిన ఓ అధికారి చెప్పారు. చైనాలో వ్యాప్తిలో ఉన్న వ్యాధిని పోలి ఉందని, జాతీయ స్థాయిలో మరెక్కడా కేసులు నమోదు కాలేదని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) నివేదిక తెలిపింది. చిన్నారుల్లో అనారోగ్యానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్న ఒహియో అధికారులు.. ఇది కొత్తరకం వ్యాధి మాత్రం కాదని చెబుతున్నారు. కానీ, ఒకే సమయంలో బహుళ వైరస్‌ల వ్యాప్తి వల్ల వైట్ లంగ్ సిండ్రోమ్‌కు కారణమవుతున్నట్లు భావిస్తున్నారు.
జాతీయంగా లేదా అంతర్జాతీయంగా సంభవించే ఏదైనా శ్వాసకోశ వ్యాధులతో సంబంధం ఉన్నట్టు ఆధారం లేదన్నారు. ‘ఈ ఏడాదిలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ తీవ్రత గతం మాదిరిగానే ఉంది. చాలా కేసులు ఇంట్లోనే కోలుకుంటాయి.. యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందజేస్తారు. ఎలాంటి మరణాలు సంభవించలేదు.. వీటిలో మైకోప్లాస్మా న్యుమోనియా, స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా, అడెనో వైరస్ వంటి ఈ కేసుల్లో గుర్తించాం’ అని తెలిపింది. సగటున 8 మంది రోగుల్లో 3 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు మైకోప్లాస్మా న్యుమోనియాతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి బారిపనడ్డవారికి హానికరమైన వైరస్‌లు ఊపిరితిత్తుల సంక్రమణకు కారణమవుతున్నట్లు తెలిపారు.
ఒక అధ్యయనం ప్రకారం, కరోనా మహమ్మారి సమయంలో లాక్‌డౌన్, మాస్క్‌లు ధరించడం, పాఠశాలలను మూసివేయడం వల్ల చిన్నారుల్లో రోగనిరోధక శక్తి గణనీయంగా తగ్గింది. అందువల్ల వారిలో కాలానుగుణ ఇన్‌ఫెక్షన్‌లకు గురయ్యే అవకాశం ఉంది. చేతులు క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు అడ్డుపెట్టుకోవడం, అనారోగ్యంతో ఉంటే ఇంట్లోనే ఉండటం వంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాప్తిని నిరోధించే అవకాశం ఉంటుందని వారెన్ కౌంటీ అధికారులు చెబుతున్నారు.
ఈ వ్యాధి సోకిన పిల్లల్లో జ్వరం, దగ్గు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. నెదర్లాండ్స్, డెన్మార్క్ లలో కూడా న్యుమోనియా కేసులు పెరుగుతున్నట్లు తెలిపారు. దీంతో అనేక యూరోపియన్ దేశాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. కాగా, చైనాలో కొత్తరకం శ్వాసకోశ వ్యాధి వ్యాప్తి నాలుగేళ్ల కిందట ఆవిర్భవించిన కోవిడ్-19 మారిదిగానే మరో మహమ్మారికి దారితీస్తుందనే ఊహాగానాలకు దారితీస్తోంది. అయితే, ఇది దీనిని చైనా మాత్రం కొట్టిపారేస్తోంది. కొత్తరకం కాదని, గతంలో తెలిసిన వైరస్‌ల కలయిక వల్లే ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నాయని అంటున్నారు. ఈ కేసుల పెరుగుదలకు కోవిడ్ ఆంక్షలు ఎత్తివేత, చలి కాలం ప్రారంభం, ఇన్‌ఫ్లూయోంజా, మైకోప్లాస్మా న్యుమోనియా, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV), SARS-CoV-2తో సహా తెలిసిన వ్యాధికారకాలు కారణమని తెలిపారు.