విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. టీడీపీ అధినేత చంద్రబాబు రాకతో పార్టీ శ్రేణులతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాలు శుక్రవారం సందడిగా మారింది. అయితే తిరుపతి నుంచి చంద్రబాబు చేరుకున్న ఇండిగో విమానంలోనే మంత్రి రోజా కూడా వచ్చారు. విమానాశ్రయం బయటకు వచ్చే ప్రయాణికుల ద్వారా టీడీపీ శ్రేణులు భారీగా ఉండడంతో ప్రత్యేక సెరెమోనియల్ లాంజ్ ద్వారా మంత్రి రోజాను పోలీసులు బయటకు పంపారు.
గతంలో విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో జనసైనికులు ఉన్న సమయంలో మంత్రి రోజాను పంపడంతో ఉద్రిక్తత తలెత్తింది. మళ్లీ అలాంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రత్యేక లాంజ్ నుంచి మంత్రి రోజాను పంపినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మరోవైపు తిరుపతి సర్వీసు విమానాశ్రయానికి చేరుకొనే పది నిమిషాల ముందు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమానాశ్రయం చేరుకున్నారు. రోడ్డు మార్గంలో జనసేనాని మంగళగిరి తరలివెళ్లగా.. మంత్రి రోజా విజయవాడ బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు ఉండవల్లి నివాసానికి బయల్దేరారు.
హైదరాబాద్‌లో ఓటు పెట్టుకుని ఇక్కడ ఆడతాం అంటే కుదరదని మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో దొంగలా పారిపోయి వచ్చిన చంద్రబాబును ఎవరూ అడగగలరన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఆడుదాం ఆంధ్రా వంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆడుదాం ఆంధ్రా పేరుతో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్త క్రీడా టోర్నమెంట్ల వీడియో లాంఛ్ ,బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో కలిసి రోజా పాల్గొన్నారు. శాశ్వత ఉద్యోగాలు గతంలో ఎప్పుడూ లేవని.. అకాడమీలు కట్టడం కోసమే కిదాంబి శ్రీకాంత్, పీవీ సింధులకు ల్యాండ్ ఇచ్చామన్నారు. సాకేత్‌కు కూడా ల్యాండ్ ఇస్తామని మంత్రి తెలిపారు. ఆడుదాం ఆంధ్రాలో గెలిచిన వారికి ఏం చేయాలో స్పోర్ట్స్ కోటా విషయమై ఆలోచిస్తామన్నారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించడం కోసం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ఆడపిల్లలు క్రీడాల్లో రాణించాలని సూచించారు. ఆన్‌లైన్, సచివాలయాల్లో ఈ క్రీడాల్లో పాల్గొనే వాళ్లు నమోదు చేసుకోవాలన్నారు మంత్రి.
100 కోట్ల బడ్జెట్‌తో ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. టోర్ణమెంట్‌లో పాల్గొనేందుకుగాను 72 గంటల్లో 5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంతమంచి అవకాశం మళ్లీ వస్తుందో లేదో .. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. కోటి మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారని భావిస్తున్నాం. ఏపీని ఆటల ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనేదే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు.