మిచౌంగ్ తుఫాను ప్రభావంతో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం తీరం వెంబడి ఈదురు గాలులతో కూడిన వర్షం కొండపోతగా కురుస్తోంది. సోమవారం రాత్రి నుంచి దివిసీమ ప్రాంతంలోని మూడు మండలాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు పునరావాస శిబిరాలకు తరలించారు. కాగా తుఫాను ప్రభావంతో విజయవాడలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షపు నీరు రోడ్లపై పొంగిపొర్లుతోంది. పలు ప్రాంతాల్లో విద్యుత్తుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించింది. తుఫాన్ ప్రభావంతో ఆర్టీసీ పలు సర్వీసులను రద్దు చేసింది. తుఫాన్ ప్రభావంతో సోమవారం తెల్లవారు ఝాము నుంచి కురుస్తున్న వర్షం, వీస్తున్న గాలులు రైతులకు తీవ్ర నష్టం కలుగజేశాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొస్తున్న సమయంలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి చాలా వరకు కోతకోసి పొలాల్లో పనలపై ఉన్న వరిపంట తడిసి నీళ్లలో నానుతుంది. మెషిన్‌తో కోత కోయించి రోడ్లపక్కన ఆరబెట్టిన ధాన్యం చాలావరకు మిల్లులకు తోలగా, లారీల్లో లోడు చేసేందుకు కూలీలు దొరకక మరికొంతమేర రాశులు చేసి, సంచుల్లోకి ఎత్తి వర్షానికి తడవకుండా పట్టాలు కప్పి రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి వరకు వర్షం లేక పోవడంతో కొంతమేర వరి పనలు మోపులు కడుతున్న సమయంలో వర్షం ప్రారంభం కావడంతో మధ్యలో నిలిపివేసిన పరిస్థితి ఏర్పడింది. కాగా సోమవారం 23 లారీల్లో ధాన్యం మిల్లులకు చేరవేసినట్టు తహసీల్దార్ మస్తాన్ తెలిపారు.