తుపాను దృష్ట్యా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై సీఎం జగన్ ఆరా తీశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, సీసీఎల్‌ఏ సెక్రటరీ ఇంతియాజ్, సీఎంఓ అధికారులతో సీఎం వైయస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. ‘ బాధితులకు మంచి సదుపాయాలు అందించాలి. సౌకర్యాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు రాకుండా చూడాలి. నెల్లూరు, తిరుపతి సహా తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో కరెంటు సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. మనుషులు, పశువులు మరణించినట్టు సమాచారం అందితే 48 గంటల్లోగా పరిహారం అందించాలి. తుపాను తగ్గిన వెంటనే ఎన్యుమరేషన్ కూడా ప్రారంభం కావాలి. గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ వ్యవస్ధలను వాడుకుని రేషన్ పంపిణీ సమర్ధవంతంగా చేపట్టాలి’ అని అధికారులకు సీఎం వైయస్ జగన్ సూచించారు.