వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు, ఆర్గానిక్ పంటలు, విత్తనాల అభివృద్ధిని పెద్ద ఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో జాతీయ స్థాయిలో మూడు మల్టీస్టేట్ కోపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేసినట్లు కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైయస్ఆర్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన నేషనల్ కోపరేటివ్ ఎక్సపోర్ట్స్ లిమిటెడ్, నేషనల్ కోపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్, భారతీయ బీజ్ సహకారి సమితి లిమిటెడ్ సంస్థలను మల్టీ స్టేట్ కోపరేటివ్ సొసైటీ యాక్ట్ కింద రిజిస్టర్ చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో కార్యకలాపాలు చేపడుతున్న ఆసక్తి కలిగిన సహకార సంఘాలు మల్టీస్టేట్ కోపరేటివ్ సొసైటీల్లో సభ్యులుగా చేరడానికి అర్హులని తెలిపారు.నేషనల్ కోపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ (ఎన్‌సీఈఎల్)ను ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్‌కో), క్రిషక్ భారతి కోపరేటివ్ లిమిటెడ్ (క్రిభ్కో), నేషనల్ అగ్రికల్చర్ కోపరేటివ్, మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్), గుజరాత్ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్, నేషనల్ కోపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంస్థల ప్రోత్సాహంతో ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఒక్కో సంస్థ అందించిన 100 కోట్ల రూపాయల ఆర్థిక సహకారంతో మొత్తం 500 కోట్ల ప్రాథమిక మూలధనంతో ఏర్పాటు చేసిన ఎన్‌సీఈఎల్‌కు 2000 కోట్లు అధీకృత షేర్ కేపిటల్‌గా నిర్ణయించారని తెలిపారు. సహకార సంఘాలు, సహకార రంగ సంస్థలకు సంబంధించిన ఉత్పత్తులు, సేవలు నేరుగా ఎగుమతి చేయడంతో పాటు ఇతర ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టడమే లక్ష్యంగా ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మేకిన్ ఇండియా విధానాన్ని ప్రోత్సహిస్తూ సహకార రంగ ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన ఎగుమతులు పెంపొందించేందుకు ఈ సంస్థ సహకారం అందిస్తుందని అన్నారు. ఎన్‌సీఈఎల్ ద్వారా జరిగే ఉన్నత స్థాయి ఎగుమతులు వివిధ స్థాయిల్లో సహకార సంఘాల ఉత్పత్తులు, సేవల మార్కెట్ లింకేజీలను బలోపేతం చేయడంతోపాటు సహకార రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని అన్నారు. ఈ సంస్థలో సభ్యత్వం కోరుతూ దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 2625 సహకార సంస్థలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.నేషనల్ కోపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సీఓఎల్)ను నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు, గుజరాత్ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్, నేషనల్ అగ్రికల్చర్ కోపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ కన్జ్యూమర్స్ కోపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ కోపరేటివ్ డెవలట్ కార్పొరేషన్ సంస్థల ప్రోత్సాహంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో సంస్థ రూ.20 కోట్ల ఆర్థిక సహకారంతో మొత్తం 100 కోట్లు ప్రాథమిక మూలధనంతో ఏర్పాటు చేసిన ఎన్ సీఓఎల్ కు 500 కోట్లు అధీకృత షేర్ కేపిటల్‌గా నిర్ణయించినట్లు తెలిపారు. వ్యవసాయ సేంద్రీయ ఉత్పత్తులకు సంబంధించి మార్కెటింగ్, లాజిస్టిక్ సదుపాయాలు, ప్యాకేజింగ్, లేబులింగ్, ప్రోసెసింగ్, టెస్టింగ్, స్టోరేజ్, కొనుగోలు మొదలగు అంశాలకు సంబంధించి సంస్థాగత సహకారం అందిస్తుందని అన్నారు. అలాగే సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు ఎన్ సీఓఎల్ లో సభ్యత్వం పొందిన సహకార సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా ఆర్థిక సహకారం అందించేందుకు సహకరిస్తుందని అన్నారు. అలాగే వివిధ పథకాలు, ఏజన్సీల సహకారంతో ఆర్గానిక్ ఉత్పత్తులకు సంబంధించి ప్రోత్సాహక, అభివృద్ధి కార్యక్రమాలు సంస్థ చేపడుతున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సభ్యత్వం కోరుతూ వివిధ సహకార సంఘాల నుండి 2475 ధరఖాస్తులు అందాయని అన్నారు.భారతీయ బీజ్ సహ్‌కారి సమితి లిమిటెడ్ (బీబీఎస్ఎస్ఎల్)ను ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోపరేటివ్ లిమిటెడ్, క్రిషక్ భారతి కోపరేటివ్ లిమిటెడ్, నేషనల్ అగ్రికల్చర్ కోపరేటివ్, మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు, నేషనల్ కోపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంస్థల ప్రోత్సాహంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో సంస్థ అందించిన 50 కోట్లు ఆర్థిక సహకారంతో మొత్తం 250 కోట్లు ప్రాథమిక మూలధనంతో ఏర్పాటు చేసిన బీబీసీసీఎల్‌కు 500 కోట్లు అధీకృత షేర్ కేపిటల్‌గా నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. కోపరేటివ్ నెట్ వర్క్ ద్వారా సింగిల్ బ్రాండ్ కింద నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి, సరఫరా ద్వారా పంట దిగుబడి పెంచడం, అలాగే దేశీయంగా అభివృద్ధి చేసే సహజసిద్దమైన విత్తనాలను ప్రోత్సహించి, సంరక్షించే విధానాన్ని అభివృద్ధి చేయడం బీబీఎస్ఎస్ఎల్ ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. సహకార సంస్థల ద్వారా నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి పెంపొందించి విదేశీ దిగుమతులపై ఆధారడడాన్ని తగ్గించేందుకు సంస్థ అన్ని విధాల సహకరిస్తుందని అన్నారు. ఆత్మనిర్బర్ భారత్ లక్ష్యాన్ని చేరుకునే విధంగా మేకిన్ ఇండియా విధానాన్ని ప్రోత్సహిస్తూ వ్యవసాయ ఉత్పత్తులను పెంపొందించి, గ్రామీణ ఆర్దిక వ్యవస్థ బలోపేతం చేసే దిశగా పనిచేస్తుందని అన్నారు. నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తి పెంచి ఉపాధి అవకాశాల్ని పెంచడంతో సహకరిస్తుందని అన్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా 8200 సహకార సంఘాల నుంచి సభ్యత్వం కోరుతూ ధరఖాస్తులు అందాయని మంత్రి తెలిపారు.