మార్చిలో ఎన్నికలు జరగవచ్చనే అంచనాల మధ్య ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కారు దూకుడు పెంచింది. ఎన్నాళ్లుగానో కాంట్రాక్టు ఉద్యోగులు ఎదురుచూస్తున్న రెగ్యులరైజేషన్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను ఎలా క్రమబద్ధీకరించాలనే దానిపై ఆర్థిక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం డిసెంబర్ 15వ తేదీన నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం రూపొందించిన సాఫ్ట్ వేర్‌లో.. ఉద్యోగుల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది. సంక్రాంతిలోపు అర్హత కలిగిన ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు 2019 ఎన్నికల సమయంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్ జారీ చేశారు. ఇదే సమయంలో 2023 ఆగస్ట్ 15 సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. రెగ్యులరైజేషన్‌కు సంబంధించి ఐదేళ్ల సర్వీస్ నిబంధన ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేశారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయం పట్ల ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య హర్షం వ్యక్తం చేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల.. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున హృదయపూర్వక కృతజ్ఞలు తెలియజేస్తున్నట్లు ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. ఈ నిర్ణయంతో కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారని ధన్యవాదాలు తెలియజేశారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల కాంట్రాక్టు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలకు మేలు చేస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్‌కు ధన్యవాదాలు తెలియచేస్తున్నారు.