తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూర్‌లోని శ్రీరామానుజర్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం అక్కడే ఉన్న గజరాజు ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. సమానత్వం కోసం పాటుపడిన శ్రీరామానుజుల వారి జన్మస్థలానికి రావడం తన అదృష్టమన్నారు చంద్రబాబు. ఏపీ, తెలుగువారి కోసం తాను అంకితభావంతో పనిచేస్తానని.. అందరికీ మంచి జరగాలని తాను ప్రార్ధించినట్లు తెలిపారు. తమిళనాడులో తనకు లభించిన ఘన స్వాగతంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. తాను కష్టంలో ఉన్న సమయంలో ప్రజలు ఇచ్చిన మద్దతు మరిచిపోలేను అన్నారు. ధర్మాన్ని రక్షించుకునేందుకు.. తెలుగు జాతి కోసం ముందుండి పనిచేస్తానన్నారు.
ఇటీవల తనకు ఎదురైన ఇబ్బందులు దూరమవ్వాలని కోరుకున్నానని పేర్కొన్నారు. తాను ఆంధ్రప్రదేశ్‌కు చేసిన మేలును ప్రజలు గుర్తుచేసుకుని సహకరించే పరిస్థితికి వచ్చారని, ఇది తనకు కొత్త అనుభూతినిస్తోందని వివరించారు. మంచి చేస్తే ప్రజలు ఎప్పుడూ తోడుంటారనేది మరోసారి రుజువైందని అన్నారు. ఏపీలో ధర్మాన్ని పరిరక్షించాల్సిన అవసరముందన్నారు. దగాపడ్డ ఆంధ్రప్రదేశ్‌ను మంచి స్థితిలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడు తనపై ఉందని చెప్పారు. ఆ బాధ్యతను నెరవేర్చేందుకు పునరంకితమవుతానని స్పష్టం చేశారు. ఏపీ ప్రజలు మార్పు తేవాలనే విషయంలో స్పష్టతతో ఉన్నారని.. 5ఏళ్ల పాటు రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే సమర్థవంతమైన నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అందరి సహకారంలో రాష్ట్రాన్ని కాపాడుకుంటామన్నారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబుకు స్థానిక టీడీపీ శ్రేణుల నుంచి ఘనస్వాగతం లభించింది. స్థానికులు, అభిమానులు చంద్రబాబు నాయుడికి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఆ తర్వాత శ్రీ పెరంబదూర్‌లోని ఆలయ నిర్వాహకులు చంద్రబాబుకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆయన్ను కలిసిన వారిలో సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ తదితరులు ఉన్నారు.