పార్లమెంట్‌లో బుధవారం చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. విజిటర్స్ గ్యాలరీ నుంచి లోక్‌సభ చాంబర్‌లోకి దూకిన ఇద్దరు యువకులు ఎంపీలను భయభ్రాంతులకు గురిచేశారు. సభా కార్యకలాపాలు కొనసాగుతున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి గ్యాలరీ నుంచి కిందకు దూకుతూ నినాదాలు చేయగా.. మరోవ్యక్తి టియర్ గ్యాస్‌ను ప్రయోగించడం కలకలం సృష్టించింది. ఇదే సమయంలో పార్లమెంటు బయట మరో ఇద్దరు ఈ తరహాలోనే ఆందోళనలు చేశారు. వీరందర్నీ అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇక, నిందితులు స్ప్రే చేసిన కలర్ గ్యాస్ డబ్బాలనేవి చాలా దేశాల్లో చట్టబద్ధమైనవి. ఇవి దాదాపు అన్ని రిటైల్ మార్కెట్లలోనూ లభ్యమవుతాయి. అయితే, వాటి వినియోగం అనేది అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఈ డబ్బాల్ని సైనిక సిబ్బందితో పాటు సాధారణ పౌరులు క్రీడా వేడుకలు లేదా ఫోటోషూట్‌లలో ఉపయోగిస్తారు. స్మోక్ గ్రెనేడ్‌ల నుంచి వెలువడే దట్టమైన పొగతో ఏర్పడిన స్మోక్ స్క్రీన్‌లు సైనిక, చట్ట అమలు కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు. మిలిటరీ ఆపరేషన్ సమయంలో ఈ దట్టమైన పొగలు మేఘాల్లో దళాల కదలికలను అస్పష్టం చేస్తాయి. శత్రువుల కంట కనిపించకుండా అడ్డుకుంటాయి. వైమానిక దాడుల సమయంలో టార్గెట్‌లను గుర్తించడం, ట్రూప్ ల్యాండింగ్, తరలింపు పాయింట్ల కోసం కూడా ఈ డబ్బాలను వినియోగిస్తారు. ఫోటోగ్రఫీలో ఇల్యూజన్స్, ఎఫెక్ట్స్ సృష్టించేందుకు వీటిని వాడతారు. క్రీడలలో ముఖ్యంగా ఫుట్‌బాల్‌లో అభిమానులు తమ క్లబ్‌ల రంగులను ప్రదర్శించడానికి ఈ డబ్బాలను ఉపయోగిస్తారు. ఐరోపా ఫుట్‌బాల్ క్లబ్ అభిమానులు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించేందుకు తరచుగా వినియోగిస్తారు.
మరోవైపు, నిందితులను కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన సాగర్ శర్మ, మనోరంజన్.. మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన అమోల్ షిండే, హరియాణాలోని హిస్సార్‌కు చెందిన నీలమ్ కౌర్‌లుగా గుర్తించారు. ఈ నలుగురికీ సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడినట్టు గుర్తించారు. ఆ తర్వాత పార్లమెంట్‌లో హంగామా చేయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. పక్కా పథకం ప్రకారమే కలర్ స్మోక్ దాడికి పాల్పడ్డారు. దాడి చేస్తామని ముందుగానే హెచ్చరించినట్టు తెలుస్తోంది. మైసూర్‌కు చెందిన సాగర్ శర్మ, మనోరంజన్‌లు స్థానిక వివేకానంద ఇన్‌స్టిట్యూట్‌లో ఇంజినీరింగ్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరి వద్ద మైసూరు ఎంపీ ప్రతాప్ సిన్హా జారీచేసిన పాస్‌లు లభించాయి. దీనిపై బీజేపీ ఎంపీ మాట్లాడుతూ.. తన నియోజకవర్గానికి చెందిన వ్యక్తులే కావడంతో వారికి విజిటర్స్ పాస్‌లు ఇచ్చినట్టు తెలిపారు. సాగర్ శర్మ, మనోరంజ్‌లు మైసూరు వెళ్తున్నట్టు అబద్దం చెప్పి మూడు రోజుల కిందట ఇంటి నుంచి వచ్చారని తేలింది. అయితే, ఐదెంచల భద్రతను దాటుకుని వీరు స్ప్రేను లోపలికి తీసుకురావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం ఘటన గురించి తెలియగానే కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ ఆరోరా సెంట్రల్ విస్టాకు చేరుకున్నారు. ఢిల్లీ పోలీసులకు చెందిన ఫొరెన్సిక్ టీమ్ కూడా రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తోంది.