ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయ్యప్ప భక్తులకు దర్శన కష్టాలు.. నిలక్కల్, పంబ వద్ద దయనీయ పరిస్థితి

national |  Suryaa Desk  | Published : Wed, Dec 13, 2023, 10:39 PM

శబరిమలకు భక్తులు పోటెత్తడంతో దర్శనాలు చేసుకోకుండానే కొందరు పందళం ఆలయంలో నెయ్యాభిషేకం చేసి వెనక్కి వెళ్లిపోతున్నారు. రద్దీ నేపథ్యంలో శబరిపీఠం నుంచి పంబ వరకూ క్యూలైన్‌‌ విస్తరించింది. శబరిమలలో పరిస్థితిపై అధ్యయనానికి కేరళ కాంగ్రెస్ నియమించిన కమిటీ మంగళవారం అక్కడ పర్యటించింది. తిరువనంతపురం ఎమ్మెల్యే రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఈ కమిటీ.. భక్తులను కలుసుకుని వారి ఇబ్బందులను తెలుసుకుంది. ఈ సందర్భంగా తాము దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నామని యాత్రికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, పరిస్థితి చక్కదిద్దడానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. అధిక ఎండలో కనీసం తాగడానికి నీళ్లు లేదా ఆహారం లేక పంబ వద్ద భక్తులు 8 నుంచి 9 గంటల పాటు క్యూలైన్‌లో నిలబడి ఉంటున్నారని చెప్పారు. పంబలో ఒకేసారి 15,000 మంది యాత్రికులు కూర్చునే విరిపంథాల్ ఉందని పేర్కొన్నారు. అయితే, ఇది 2018 వరదల్లో కొట్టుకుపోవడంతో రెండు చిన్న విశ్రాంతి స్థలాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపారు.


అలాగే, మరికొందరు భక్తులు ఏసీ సౌకర్యం లేకుండా బస్సులను నడుపుతున్నారని ఆరోపించారు. అనంతరం పంబలో ప్యానెల్ సమావేశమై యుడిఎఫ్ రాష్ట్ర కమిటీకి సమర్పించాల్సిన నివేదికపై చర్చించింది. ‘మౌళిక సదుపాయాల కొరత కారణంగా భక్తులు ఎదుర్కొంటున్న తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనపై చట్టపరమైన చర్యలకు సిఫార్సు చేయాలని మా బృందం నిర్ణయించింది’ అని రాధాకృష్ణన్ అన్నారు. మరోవైపు, శబరిమలలో ఏర్పాట్లు చేయడంలో పినరయ్ విజయన్ సర్కారు విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు బుధవారం త్రివేండ్రంలో ఆందోళనకు దిగారు. వారిని అడ్డుకోడానికి పోలీసులు ప్రయత్నించడంతో వాగ్వాదానికి దిగారు. బారికేడ్లను నెట్టుకుంటూ సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడికి ప్రయత్నించారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగించాల్సి వచ్చింది.


శబరిగిరికి వెళ్లే క్రమంలో బుధవారం కేరళలోని కొల్లంకి చెందిన రాజేశ్ పిల్లయ్ అనే భక్తుడు గుండెపోటుతో మృతిచెందాడు. యాత్రికుల బృందంతో కలసి పులిమేడు అటవీ ప్రాంతం గుండా వెళ్తుండగా ఉదయం 10.30 ప్రాంతంలో గుండెపోటుకు గురయ్యాడు. ద్య సిబ్బంది, అటవీ అధికారులు, సమీప ఎయిడ్ పోస్ట్‌లోని ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ సభ్యులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వైద్య సహాయం అందించినప్పటికీ అతడిని రక్షించలేకపోయారు. అనంతరం అతని మృతదేహాన్ని కుమిలిలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మంగళవారం సన్నిధానంలో తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు గుండెపోటుతో చనిపోయాడు. గతవారం తమిళనాడుకు చెందిన ఓ 12 ఏళ్ల చిన్నారి కూడా ఈ విధంగానే మృతి చెందింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com