ఇజ్రాయెల్, హమాస్ మధ్య మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఇరువైపులా సైనిక బలగాలే కాకుండా సామాన్య పౌరులు కూడా మృత్యువాత పడ్డారు. ఇక గాజాలో ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన భూతల దాడులతో పాలస్తీనా వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ క్రమంలోనే గాజాలో పరిస్థితి, కాల్పుల విరమణపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటు వేసింది.
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంతో గాజాలో సామాన్య ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అటు.. హమాస్ మిలిటెంట్ల చెరలో బందీలుగా ఉన్నవారు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. దీంతో వెంటనే ఇరు పక్షాలు తక్షణ కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకోవాలని.. దీంతోపాటు ఎలాంటి షరతులు లేకుండా తమ చెరలో ఉన్న బందీలను విడుదల చేయాలని హమాస్ మిలిటెంట్లను డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి అనుకూలంగా భారత్ ఓటు వేసింది.
ఐక్యరాజ్యసమితి అత్యవసర ప్రత్యేక సమావేశంలో భాగంగా ఈ తీర్మానాన్ని ఈజిప్ట్ ప్రవేశపెట్టింది. మొత్తం ఐరాసలోని 193 సభ్యదేశాల్లో 153 దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. మరో 23 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. దీంతో ఈ తీర్మానం ఆమోదం పొందింది. అయితే గాజాలో తక్షణ కాల్పుల విరమణ, బంధీల విడుదలకు సంబంధించి ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడారు. ఇజ్రాయెల్ - హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం, దాని పర్యవసానాల గురించి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటు వేసిందని తెలిపారు. అక్టోబర్ 7 వ తేదీన ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడి జరిగిందని.. అప్పుడు హమాస్ మిలిటెంట్ల చెరలో బందీలుగా ఉన్న వారి గురించి తీవ్ర ఆందోళన వ్యక్తమైందని పేర్కొన్నారు.
అయితే దానికి ప్రతీకారంగా ప్రస్తుతం గాజాపై ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడులతో భారీగా ప్రాణనష్టం సంభవిస్తోందని.. మహిళలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని రుచిరా కాంబోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక పాలస్తీనా సమస్యకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె వెల్లడించారు. అయితే ఈ తీర్మానం ఆమోదం లభించడంపై సంతోషం వ్యక్తం చేసిన రుచిరా కాంబోజ్.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సరైన సమతుల్యతను సాధించడమే అసలైన సవాలు అని తెలిపారు. మరోవైపు.. అక్టోబర్‌లో ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి భారత్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ గాజాలో మానవతా సాయం ఎలాంటి అవాంతరం లేకుండా అందాలని అప్పుడు భారత్ పిలుపునిచ్చింది.
ఇక తాజాగా ప్రవేశపెట్టిన తీర్మానంలో హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడి గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. దీంతో అమెరికా ఈ ముసాయిదాకు సవరణను ప్రతిపాదించింది. ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడి.. ఆ తర్వాత బందీలుగా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఈ సవరణకు కూడా భారత్ అనుకూలంగా ఓటు వేయడం విశేషం. మరోవైపు.. ఇటీవల గాజాలో తక్షణమే కాల్పులు విరమణ జరగాలని ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి 15 సభ్య దేశాల్లో 13 అనుకూలంగా ఓటేశాయి. అయితే ఈ డిమాండ్‌ను వ్యతిరేకించిన అమెరికా.. తన వీటో అధికారంతో దాన్ని అడ్డుకుంది.