ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేశంలో కలకలం సృష్టించిన మహదేవ్ బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్ వ్యవహారంలో కీలక వ్యక్తి పోలీసుల చేతికి చిక్కాడు. మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ యజమానుల్లో ఒకరైన రవి ఉప్పల్‌ను దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి. మనీ లాండరింగ్ కేసులో విచారణ జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా రవి ఉప్పల్‌ను దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే రవి ఉప్పల్‌ను గత వారమే దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రవి ఉప్పల్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు దుబాయ్ అధికారులతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
ఛత్తీస్‌గఢ్‌లోని భిలాల్ ప్రాంతానికి చెందిన రవి ఉప్పల్, సౌరభ్ చంద్రశేఖర్ భారత్‌లో మహదేవ్ ఆన్‌లై్ బెట్టింగ్ యాప్‌ను ప్రారంభించారు. దుబాయ్ కేంద్రంగా ఈ మహదేవ్ బెట్టింగ్ యాప్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అయితే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ముసుగులో వీరు మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగారు. ఈ కేసులో ఒక్కొక్కరిని విచారణ జరిపిన ఈడీ.. దాని నెట్‌వర్క్‌ను పట్టుకుంది. దీంతో ఈ కేసుతో సంబంధం ఉన్న వారి నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలోనే కోల్‌కతా, భోపాల్, ముంబై సహా వివిధ నగరాల్లో ఈడీ అధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించగా.. రూ. వందల కోట్లలో అక్రమ నగదు బయటికి రావడం సంచలనంగా మారింది. బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చే మొత్తాన్ని ఆఫ్‌షోర్ ఖాతాలకు తరలించేందుకు హవాలా మార్గాన్ని ఉపయోగిస్తున్నట్లు ఈడీ అధికారులు దర్యాప్తులో గుర్తించారు.
అయితే ఈ మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే ఈడీ అధికారులు ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేశారు. రవి ఉప్పల్‌కు వనౌటు దేశ పాస్‌పోర్ట్ ఉందని.. దాన్ని ఉపయోగించుకుని అతడు వివిధ దేశాల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని ఈడీ దర్యాప్తులో తేలింది. అయితే రవి ఉప్పల్ భారత పౌరసత్వాన్ని వదులుకోలేదని.. భారత పౌరసత్వంపైనే ఆస్ట్రేలియా వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్లు గుర్తించింది. ఇక ఈ మహదేవ్ బెట్టింగ్ యాప్ మరో ప్రమోటర్ అయిన సౌరభ్ చంద్రశేఖర్ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో యూఈఏలో అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. ఇందుకు రూ.200 కోట్లు ఖర్చు చేసినట్లు ఈడీ గుర్తించింది. సౌరబ్ చంద్రశేఖర్ పెళ్లికి బాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు కూడా హాజరైనట్లు ఈడీ తమ ఛార్జ్‌షీట్‌లో వెల్లడించింది. ఈ మనీలాండరింగ్ ఆరోపణలను మహదేవ్ యాప్ బెట్టింగ్ నిర్వాహకులు రవి ఉప్పల్, సౌరభ్ చంద్రశేఖర్ ఖండించారు. మహదేవ్ బెట్టింగ్ యాప్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని.. దాన్ని శుభమ్ సోని అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడని పేర్కొన్నారు. ఇక ఈ మహదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్‌పైనా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సీఎంగా ఉన్న సమయంలో భూపేష్ బఘేల్‌కు రూ.508 కోట్లు చెల్లించినట్లు క్యాష్ కొరియర్ ఆసిమ్ దాస్ తమకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పాడని ఈడీ వెల్లడించింది.
ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆసిమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ.5 కోట్ల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ డబ్బును తనకు శుభమ్ సోని ఇచ్చాడని ఆసిమ్ చెప్పినట్లు ఈడీ వెల్లడించింది. కాగా.. ఆ తర్వాత అతడు మాట మార్చినట్లు తెలుస్తోంది. ఈడీ అధికారులు తమతో బలవంతంగా ఆ వాంగ్మూలంపై సంతకం చేయించినట్లు ఆసిమ్ ఆ మధ్య జైలు అధికారికి లేఖ రాసినట్లు వార్తలు వెలువడ్డాయి.