ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇటీవల సమర్థించింది. ఇది రాజ్యాంగ బద్ధమేనని పేర్కొంటూ.. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. ఈ క్రమంలోనే ఈ సుప్రీంకోర్టు తీర్పుపై ఎప్పటిలాగానే పొరుగున ఉన్న పాకిస్థాన్ తనదైన శైలిలో వక్రబుద్ధిని చూపించుకుంది. తాజాగా ఈ అంశంపై చైనా స్పందించింది. సుప్రీం తీర్పు తర్వాత భారత్, పాక్ దేశాలు శాంతి చర్చల ద్వారా కాశ్మీర్ అంశాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది.
ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చైనా మంగళవారం స్పందించింది. కాశ్మీర్ సమస్యను భారత్-పాక్ దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పాకిస్థాన్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడారు. కాశ్మీర్ అంశంపై చైనా వైఖరి అస్పష్టంగా ఉందని పేర్కొన్నారు. అయితే కాశ్మీర్ సమస్య అనేది భారత్, పాకిస్తాన్ మధ్య చాలా ఏళ్లుగా కొనసాగుతున్న పాత వివాదమని చెప్పారు. ఐక్యరాజ్యసమితి చార్టర్, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలు, రెండు దేశాల ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం శాంతియుత మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు పక్షాలకు మావో నింగ్ హితవు పలికారు.
కాశ్మీర్ అంశంపై రెండు వైపులా ఉన్న పార్టీలు చర్చలు, సంప్రదింపులు జరపాలని.. కేవలం శాంతియుత చర్చల ద్వారానే వివాదానికి ముగింపు పలకాలని మావో నింగ్ పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పేందుకు రెండు దేశాలు కృషి చేయాలని తెలిపారు. మరోవైపు.. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పాకిస్థాన్ కారు కూతలు కూసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు చట్టపరమైన ప్రాముఖ్యత లేదని పాకిస్థాన్ పేర్కొంది. దీంతో పాటు 2019 ఆగస్టు 5 వ తేదీన భారత్ తీసుకున్న ఏకపక్ష, చట్టవిరుద్ధ నిర్ణయాన్ని అంతర్జాతీయ చట్టం గుర్తించదని పాక్ పేర్కొనడం గమనార్హం. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన వ్యవహారంలో విచారణ జరిపిన సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైందేనని తేల్చింది. దీంతోపాటు వీలైనంత త్వరగా జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని తెలిపింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వ తేదీలోగా జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.