టీటీడీ నిధులు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తిరుపతికి కార్పొరేషన్‌కు టీటీడీ నిధులు కేటాయించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. నిధుల విడుదల నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. తిరుపతి పరిశుభ్రత, తిరుపతి రోడ్ల నిర్వహణ కోసం కార్పొరేషన్ నాలుగు టెండర్లు పిలిచింది. దీన్ని సవాలు చేస్తూ బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. టీటీడీ నుంచి నిధుల విడుదల అనేది దేవాదాయ చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని లాయర్ వాదించారు. టీటీడీ నిధులు భక్తుల సౌకర్యాలు, తిరుమల అభివృద్ధి కోసమే వినియోగించాలని కోరారు. టీటీడీ నిధులు మళ్లించడం దేవాదాయ చట్టం సెక్షన్ 111కు విరుద్ధమని.. రూ.100 కోట్లు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు మళ్లించారన్నారు. గతంలో ఎప్పుడూ టీటీడీ నిధులు మళ్లించలేదన్నారు. పిటిషనర్ బాలాజీ వాదనలు పరిగణలోనికి తీసుకున్న హైకోర్టు.. పారిశుద్ధ్య పనులకు నిధులు విడుదల చేయొద్దని ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్లు ఫైనలైజ్ చేసినా నిధులు విడుదల చెయ్యొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీటీడీ, ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిల్‌పై విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.