వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ..... గత ప్రభుత్వ హయాంలో నిరాశ, నిస్పృహతో పాతపట్నం వాసులు కుమిలిపోయారని, జగన్ సీఎం కాగానే దీర్ఖకాలికంగా పెండింగ్ సమస్యలను పరిష్కరించి అభివృద్ధికి బాటలు వేసారని కొనియాడారు. ప్రజలు నాడు టీడీపీకి అధికారమిస్తే అభివృద్ధి చేయకుండా దోచుకో.... దాచుకో రీతిలో అవినీతికి పాల్పడ్డారన్నారు. పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 1800 కోట్లు మంజూరు చేసారని వివరించారు. అలాగే కేవలం 8 నెలల కాలంలో 11 కోట్లతో కాకినాడ బ్రిడ్జిని జగన్ సహకారంతో శరవేగంగా నిర్మాణం జరగడంతో ఒడిశా ప్రాంత గ్రామాల నుంచి రాకపోకలను సునాయాసం చేసారని ఆనందం వ్యక్తం చేసారు. వంశధార నిర్వాసితుల నోటి ముందున్న కూడును టీడీపీ నేతలు లాక్కొగా, జగన్ నాడు ప్రతిపక్ష నేత హోదాలో వచ్చి న్యాయం చేస్తానని అభయమిచ్చిన మేరకు సీఎం కాగానే రూ. 216 కోట్లు అదనపు పరిహారం అందించారన్నారు. హిరమండల ఎత్తిపోతల పథకాన్ని కూడా జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూ. 176 కోట్ల వ్యయం చేసి ఈ ప్రాంతాన్ని శస్యశ్యామలం చేసారని గుర్తు చేసారు. రూ. 750 కోట్లతో వైఎస్సార్ శుద్ధ జలం ప్రాజెక్టును చేపట్టి ఉద్దానం ప్రజల కష్టాలను తీరుస్తున్నారన్నారు.