అయోధ్యలో కొత్తగా నిర్మించబోయే మసీదు శంకుస్థాపనకు మక్కా నుంచి మతపెద్ద రానున్నారు. మక్కా నగరంలోని ముస్లింలకు అత్యంత పవిత్రమైన కాబా వద్ద నమాజ్‌లకు నాయకత్వం వహించే ఇమామ్-ఇ-హరమ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. బాబ్రీ మసీదు స్థానంలో నిర్మించబోయే మసీదుకు స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అయోధ్యకు 25 కి.మీ. దూరంలోని ధన్నిపుర్ వద్ద మసీదు నిర్మాణానికి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం స్థలాన్ని కేటాయిచింది. కొత్తగా నిర్మించబోయే ఈ ప్రార్థనా మందిరానికి మహ్మద్ బిన్ అబ్దుల్లాహ్ మసీదు అనే పేరు సూచించారు.
మహ్మద్ బిన్ అబ్దుల్లాహ్ మసీదు అభివృద్ధి కమిటీకి ఛైర్మన్‌గా ఉన్న ముంబయికి చెందిన బీజేపీ నేత హజీ అరాఫత్ షేక్ మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద మసీదుగా నిలుస్తుందని అన్నారు. అంతేకాదు, 21 అడుగుల పొడవు, 36 అడుగుల వెడల్పుతో ప్రపంచంలోనే అతిపెద్ద ఖురాన్‌ను నెలకొల్పనున్నట్టు తెలిపారు. జూలై 29, 2020న ఏర్పడిన ట్రస్ట్ ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ మొదట్లో అయోధ్య మసీదు, మరికొన్ని సౌకర్యాలను నిర్మించే పనిని చేపట్టింది. అయితే, ఈ ఏడాది అక్టోబర్‌లో ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఫౌండేషన్ ఛైర్మన్ జుఫర్ అహ్మద్ ఫరూఖీ, పలువురు సీనియర్ మతపెద్దలు.. మసీదుకు ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అని పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా శంకుస్థాపన చేయడంతో పాటు మసీదు డిజైన్‌ను కూడా విడుదల చేశారు. ఈ మసీదులో ఇస్లాం ఐదు స్తంభాలకు ప్రతీకగా ఐదు మినార్లు ఉంటాయి.. - అవి కలిమా, నమాజ్, రోజా, హజ్, జకాత్’ అని షేక్ చెప్పారు. తాను ఫౌండేషన్‌కు ట్రస్టీగా ఉన్నానని, ఇప్పుడు మసీదు అభివృద్ధి కమిటీకి చీఫ్‌గా కూడా బాధ్యతలు చేపట్టినట్టు తెలిపారు. మసీదుతో పాటు ప్రాంగణంలో క్యాన్సర్ ఆసుపత్రి, పాఠశాలలు, కళాశాలలు, మ్యూజియం, లైబ్రరీ, సందర్శకులకు ఆహారం ఉచితంగా అందించే పూర్తిగా శాఖాహార వంటశాల కూడా ఉంటాయి.
వాజు ఖానా సమీపంలో భారీ అక్వేరియం లేదా పురుషులు, మహిళలకు ప్రత్యేక విభాగాలతో కూడిన అబ్యులేషన్ స్పేస్ ఒక ప్రధాన ఆకర్షణగా ఉంటుందని షేక్ వెల్లడించారు. దీని అందం తాజ్ మహల్‌ను మించిపోతుందని పేర్కొన్నారు. ‘సూర్యాస్తమయం వేళ సాయంత్రం నమాజ్ పిలుపుతో మసీదులోని ఫౌంటైన్లు అందాలను సంతరించుకుంటాయి’ అని షేక్ వివరించారు. ‘ఇది తాజ్ మహల్ కంటే చాలా అందంగా ఉంటుంది.. ఇక్కడ అందరూ ప్రార్థన చేయకపోయినా శాంతి, సామరస్యానికి సంబంధించిన ఈ స్మారక చిహ్నాన్ని చూడటానికి అన్ని మతాల ప్రజలు వస్తారు’ అని అశాభావం వ్యక్తం చేశారు.