తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. విపరీతమైన చలి కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. అయినా భోగి మంటలతో కాలం గడుపుతున్నారు. పొగమంచు కారణంగా రోడ్లపై ఏముందో కూడా చూడలేకపోతున్నారు. దీంతో వాహనదారులు పగటిపూట కూడా లైట్లు వేసుకుని వాహనాలు నడుపుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఏజెన్సీ ఏరియాల్లో చలి పంజా విసరడంతో ప్రజలు వణికిపోతున్నారు. మిచౌంగ్ తుఫాన్ తర్వాత నుంచి అల్లూరి జిల్లా పాడేరు ప్రజలు చలితో గజగజా వణికిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువవడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయి.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరో రెండు మూడు రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. తూర్పు, ఆగ్నేయం నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.