సివిల్ సర్విస్ పరీక్షలో ప్రిలిమినరీ పరీక్ష పాసైన విద్యార్థులకు రూ.1లక్ష ప్రోత్సాహకం.. మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైతే అదనంగా మరో రూ.50 వేల ప్రోత్సాహకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. అలాగే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాల అభ్యర్థులు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన శిక్షణతోపాటు వారు సొంతంగా ప్రిపేర్ అయ్యేందుకు ఆర్థికంగా తోడ్పాటునందిస్తోంది. అభ్యర్థులు ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు పాసైన ప్రతిసారీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నగదు ప్రోత్సాహకం అందిస్తోంది. నిజానికి.. గత ప్రభుత్వంలో సివిల్ సర్వీసెస్ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు మేలు కలిగేలా అరకొరగా పథకాన్ని అమలుచేసింది. కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం లంచాలకు, వివక్షకు తావులేకుండా అర్హులైన ప్రతి అభ్యర్థికీ లబ్ధిచేకూరుస్తూ నేరుగా వారి ఖాతాల్లో జమచేస్తోంది.