ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎనిమిదో తరగతి విద్యార్థులకు వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్ పంపిణీ చేసారు. పేదింటి పిల్లలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తాచాటాలన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం మేరకు రూ.620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ గల 4,34,185 ట్యాబ్స్‌ను 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ఈ పంపిణీని ఆరంబించారు. దాదాపు రూ.17,500కు పైగా మార్కెట్ విలువ గల ఒక్కో ట్యాబ్.. రూ.15,500 విలువ గల బైజూస్ కంటెంట్‌తో కలిపి ప్రతి విద్యార్థికీ రూ.33వేల మేర లబ్ధి చేకూరనుంది. ఇప్పుడిచ్చే ట్యాబ్స్‌తో కలిపి రెండేళ్లలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిపి రూ.1,305.74 కోట్ల విలువైన 9,52,925 ట్యాబ్‌లను ప్రభుత్వం అందించింది. వీటిల్లో ఎనిమిదో తరగతితో పాటు, 9, 10 తరగతుల బైజూస్ కంటెంట్‌ను కూడా లోడ్ చేయడంతో పాటు ఇంటర్మీడియట్ కంటెంట్ కూడా అప్లోడ్ చేసేందుకు వీలుగా ట్యాబ్ సామర్థ్యాన్ని 256 జీబీకి పెంచి అందిస్తున్నారు. ఇక గత ఏడాది విద్యార్థులు, ఉపాధ్యాయులకు 5,18,740 ట్యాబ్స్‌ను పంపిణీ చేశారు.