పదేళ్లు అవుతుంది రాష్ట్రం విడిపోయి, హైద్రాబాద్ వదిలి చంద్రబాబు, పవన్ ఏపీ ఎందుకు రారు ? ఎందుకు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకోరు ? అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పొలిపల్లి సభలో మాట్లాడిన వారెవ్వరికీ ఏపీలో స్థిర నివాసం అంటూ ఏదీ లేదని, వాళ్లంతా నాన్ లోకల్స్ అని, పొరుగు రాష్ట్రం నాయకులం తా ఇటుగా వచ్చి తమకు ఓటేయమంటున్నారని ? ఒక్కసారి ప్రజలంతా ఆలోచించాలని మంత్రి ధర్మాన అన్నారు. ఇదే విధంగా పొరుగు రాష్ట్రాలు అయిన ఏ ఒడిశా నుంచో ఏ తమిళ నాడు నుంచో నాయకులు వచ్చి పోటీ చేసి ముఖ్యమంత్రి అవుతామంటే ఒప్పుకుంటామా ? ఇక్కడ చంద్రబాబు కానీ లోకేశ్ కానీ పవన్ కానీ ఎవ్వరూ లోకల్ నాయకులు కాదు అని.. వారేం చెప్పినా అవేవీ నమ్మశక్యం కావని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలుపుకుని,జనం అందరి మెప్పునూ పొందిన సమర్థ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. గార మండలం,ఎంపీడీఓ కార్యాలయం వద్ద సీఎం జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా..మంత్రి ధర్మాన మాట్లాడుతూ..పేదలందరికీ మంచి చేయాలన్న తపన ఉన్న నాయకుడు జగన్. అన్ని వర్గాలకూ మంచి చేస్తున్న ఏకైక నేత జగన్. పేదలకు మంచి జరగకూడదు అని విపక్షాలు విష ప్రచారం చేస్తూ ఉన్నాయి. పిల్లలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ ట్యాబ్ లు అందజేస్తున్నాం. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకూ బై జూస్ కంటెంట్ ను అందిస్తున్నాం. ఈ కంటెంట్ ద్వారా విద్యార్థులు తమ అంతర్గత నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు. అలానే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలున్న స్టడీ మెటీరియల్ అందుకుని పోటీ ప్రపంచంలో ఆశించిన ఫలితాలు సాధించి తలెత్తు కోవచ్చు. రాణించవచ్చు. పిల్లలకు ట్యాబ్ లు ఇస్తే పాడయిపోతున్నారు అంటూ ఈనాడు కథనాలు వేస్తున్నారు. పిల్లలకు ఇస్తున్న వాటిలో అవసరం అయిన వాటినే ఉంచి,మిగిలిన వాటిని బ్రౌజ్ చేయకుండా అని ట్యాబ్ లను లాక్ చేసి ఇస్తున్నారు. ఇది తెలిసి కూడా తప్పుడు రాతలు రాస్తున్నారు. ఇవాళ ఆధునిక కాలంలో అంతా దూసుకుపోతున్నారు. వారితో పాటే ప్రభుత్వ బడిలో చదివే విద్యార్థికి అవసరమైన విజ్ఞాన విషయాలు అందించేందుకు ట్యాబ్ లు అందిస్తుంటే ఈనాడు పత్రిక విలేకరులు తప్పుడు రాతలు రాస్తున్నారు. సమాజంలో నెలకొన్న హెచ్చు,తగ్గులు తగ్గించడానికి జగన్ ప్రయత్నం చేస్తున్నారు.