ఛత్తీస్ గఢ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా నేడు 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితో నూతన కేబినెట్ కొలువుదీరనుంది. ఉదయం 11.45 గంటలకు గవర్నర్ హౌస్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి మంత్రుల పేర్లు ప్రకటించారు. వారిలో బ్రిజ్‌మోహన్ అగర్వాల్, రామ్ విచార్ నేతమ్, దయాల్‌దాస్ బాఘేల్, కేదార్ కశ్యప్, లఖన్‌లాల్ దేవాంగన్, శ్యామ్ బిహారీ జైస్వాల్, OP చౌదరి, తంక్రమ్ వర్మ, లక్ష్మీ రాజ్‌వాడే ఉన్నారు. మిగతా కేబినెట్ విస్తరణ కూడా త్వరలో ఉంటుందని సీఎం చెప్పారు. గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్ సమక్షంలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు.
రానున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు కేబినెట్ ఏర్పాటులో సోషల్ ఇంజినీరింగ్ కు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో పాటు ఎన్నికల మేనిఫెస్టో, పార్టీ అజెండాపై లోతైన చర్చ జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఛత్తీస్‌గఢ్ మంత్రివర్గ ఏర్పాటుపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం విష్ణుదేవ్, ఉప ముఖ్యమంత్రులు అరుణ్ సాహు, విజయ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. విష్ణు దేవ్ 1999 నుండి 2014 వరకు రాయ్‌గఢ్ నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ 54, కాంగ్రెస్ 35 స్థానాలు గెలుచుకుంది.