అరేబియా మహా సముద్రంలో శనివారం వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి చోటుచేసుకుంది. గుజరాత్ తీరంలోని పోరుబందర్ సమీపంలో ఈ ఘటన జరగ్గా.. నౌకలో పేలుడు సంభవించి, మంటలు చెలరేగాయి. అయితే, అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం లేదని అధికారులు తెలిపారు. సిబ్బందిలో 20 మంది భారతీయులు ఉన్నట్టు వివరించారు. ఈ ఘటనతో పోర్‌బందర్ తీరానికి 217 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ఎంవీ కెమ్ ప్లూటో అనే నౌక వైపు భారతీయ కోస్ట్ గార్డ్ నౌక కదులుతున్నట్లు ఏఎన్ఐ పేర్కొంది. సౌదీ అరేబియాలోని ఓడరేవు నుంచి క్రూడాయిల్‌తో కూడిన నౌక మంగళూరు వైపు వెళుతోంది. ఇండియన్ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లో పెట్రోలింగ్ చేస్తున్న కోస్ట్ గార్డ్ నౌక ఐసీజీఎస్ విక్రమ్‌ను ప్రమాదంలో ఉన్న వాణిజ్య నౌక వైపు మళ్లించినట్టు రక్షణశాఖ అధికారులు తెలిపారు. కోస్ట్ గార్డ్ నౌక తనకు సహాయం అందించడానికి ప్రాంతంలోని అన్ని నౌకలను అప్రమత్తం చేసింది. డ్రోన్ దాడి తర్వాత చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చినా కానీ, నౌక పనితీరును ప్రభావితం చేసింది. సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు.
కాగా, సోమవారం హైజాక్ చేసిన మాల్టా కార్గో నౌకలో గాయపడిన నావికుడి తరలింపునకు భారత నౌకాదళం సహాయం చేసిన కొద్ది రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది. సోమాలియా సమీపంలో అరేబియా సముద్రంలో ఎంవీ రుయెనీ అనే ఓడలోకి ఆరుగురు సముద్రపు దొంగలుఅక్రమంగా ప్రవేశించి, హైజాక్ చేసిన విషయం తెలిసిందే. నౌకతో పాటు అందులోని సిబ్బంది రక్షణ కోసం యుద్ధ విమానాన్ని పంపినట్టు నౌకాదళ సిబ్బంది తెలిపారు. అవసరం మేరకు యుద్ధ నౌకను కూడా పంపామని వివరించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని, మంటలు అదుపులోకి వచ్చాయని వెల్లడించారు. అయితే, ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇంత వరకూ ఎవరూ ప్రకటన విడుదల చేయలేదు.