ఏపీ రాష్ట్ర రాజకీయాలు రసోత్తరంగా మారుతున్నాయి. ఇదిలావుంటే టీడీపీ అధినేత చంద్రబాబును ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కలవడంపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించారు. పవన్ కల్యాణ్, టీడీపీ శ్రేణులపై చంద్రబాబు నమ్మకం కోల్పోయినట్టు కనిపిస్తోందని, అందుకే పీకేని తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. జగన్ జనం గుండెల్లో ఉన్నారని, ఎవరు వచ్చినా ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. ఏపీలో మరోసారి వైసీపీదే గెలుపు అని ఢంకా బజాయించారు. "చంద్రబాబునాయుడికి సిగ్గు, శరం, మానాభిమానాలు ఏవీ లేవని ఆయన చర్యల ద్వారా అర్థమవుతుంది. చంద్రబాబు, లోకేశ్ గతంలో ప్రశాంత్ కిశోర్ గురించి ఏం మాట్లాడారు? బీహారోడు ఇక్కడికొచ్చి ఏం పీకుతాడు? బీహారోడి ఆట కట్టు, తోలు తీస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. బీహారోడికి ఇక్కడేం పని అని మాట్లాడారు. మాకెవడి సలహాలు అక్కర్లేదు, మేం ప్రజలను నమ్ముకున్నాం అని లోకేశ్ అన్నాడు. మరి ఇవాళ ఎవడ్ని నమ్ముకున్నారు? మేం ఛీ కొడితే బయటికి వెళ్లినోడ్ని గతిలేక బతిమాలి తెచ్చుకున్నారు. పవన్ కల్యాణ్ పై నమ్మకం లేదు. పార్టీ కార్యకర్తలను నమ్ముకునే పరిస్థితి లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది" అని పేర్ని నాని పేర్కొన్నారు.