ఓటరు జాబితాలో అవకతవకలపై టీడీపీ నేతలు ఇవాళ విజయవాడలో కేంద్ర ఎన్నికల బృందాన్ని కలిశారు. ధూళిపాళ్ల నరేంద్ర, వర్ల రామయ్య, బొండా ఉమ తదితరులు ఈసీని కలిసి రాష్ట్రంలో ఓటరు జాబితాల్లో అక్రమాలు జరుగుతున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈసీని కలిసిన అనంతరం టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియకు వాలంటీర్లను, గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందిని దూరంగా ఉంచాలని ఈసీని కోరామని వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియను ఉపాధ్యాయులకే అప్పగించాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. కుల సంఘాల సమావేశాలకు అధికారులు వెళ్లడంపై ఫిర్యాదు చేశామని చెప్పారు. కుల సంఘాల భేటీకి వెళ్లేవారిపై చర్యలు ఉంటాయని ఈసీ చెప్పిందని టీడీపీ నేతలు వివరించారు. "ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేశాం. గంపగుత్తగా ఫారం-7 దరఖాస్తులు ఇవ్వడంపై ఫిర్యాదు చేశాం. 7 నియోజకవర్గాల్లో కేంద్ర బృందంతో పర్యవేక్షణ చేయాలని కోరాం. ముఖ్యంగా, చంద్రగిరి, పర్చూరు, కాకినాడ, వినుకొండలో పర్యవేక్షణ ఉండాలని కోరాం" అని టీడీపీ నేతలు పేర్కొన్నారు.