గ్రామస్థాయిలోని ప్రతిభ గల క్రీడాకారులను వెలికితీసేందుకు, మన పిల్లలను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడించేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ‘ఆడుదాం.. ఆంధ్రా’ టోర్నీ నిర్వహిస్తోంది. నేటి నుంచి మొదలవుతున్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోతాయని చెప్పడానికి గర్వపడుతున్నా.. ఈ టోర్నీ ఫిబ్రవరి 10వ తేదీ వరకు (47) రోజుల పాటు ఊరూరా పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఇది అందరూ పాల్గొనే గొప్ప పండుగగా చరిత్రలో నిలిచిపోతుంది అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్‌లో ‘ఆడుదాం.. ఆంధ్రా’ టోర్నమెంట్‌ను సీఎం వైయస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు క్రీడాకారులకు పంపిణీ చేయబోయే కిట్లను పంపిణీ చేశారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి సీఎం వైయస్ జగన్ ప్రసంగించారు. ఆడుదాం.. ఆంధ్రా కార్యక్రమం వెనుక మన ప్రభుత్వానికి రెండు ప్రధాన ఉద్దేశాలు ఉన్నాయని సీఎం వైయస్ జగన్ చెప్పారు. గ్రామస్థాయిలోని ఆణిముత్యాలను వెలికితీసి వారిని ప్రపంచానికి పరిచయం చేయడం ఒకటైతే.. వ్యాయామం, క్రీడల వల్ల అనారోగ్య సమస్యలు దూరమైపోతాయనేది రెండో ఉద్దేశమని సీఎం వైయస్ జగన్ చెప్పారు. ఈ రెండు ప్రధానమైన ఉద్దేశాలను అచీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం వివరించారు.