డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10వతేదీ వరకు 47 రోజుల పాటు నిర్విరామంగా ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీలను నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. తొలి దశలో జనవరి 9వతేదీ నాటికి గ్రామ/వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలను పూర్తి చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 10 నుంచి 23 వరకు మండల స్థాయిలో, జనవరి 24 నుంచి 30 వరకు నియోజకవర్గ స్థాయిలో, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 6వతేదీ నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటలకు వరకు పోటీలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేశారు. పాఠశాల విద్యాశాఖ పీఈటీలు, పీడీలతో పాటు శాప్ కోచ్‌లు, క్రీడా సంఘాలను పోటీలు సమర్థంగా నిర్వహించేలా సమాయత్తం చేశారు. ఇప్పటికే రిఫరీలుగా 1.50 లక్షల మంది వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ అందించారు. క్రీడాకారుల మొబైల్ ఫోన్లకు మ్యాచ్‌ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించనున్నారు.