ట్రెండింగ్
Epaper    English    தமிழ்

8 ఏళ్లు కోమాలో ఉండి కన్నుమూసిన ఆర్మీ అధికారి

national |  Suryaa Desk  | Published : Tue, Dec 26, 2023, 10:48 PM

ఉగ్రవాదులతో జరిగిన పోరులో తీవ్రంగా గాయపడిన ఓ ఆర్మీ అధికారి.. ఎనిమిదేళ్ల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. ఇప్పటి వరకూ కోమాలో ఉన్న ఆయన ఆదివారం కన్నుమూశారు. టెరిటోరీ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ కరన్‌బీర్ సింగ్ నాట్.. 2015 నవంబరు 22న జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారాలో ముష్కరుల ఏరివేత ఆపరేషన్ సమయంలో ముఖానికి బుల్లెట్ తగిలి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన ఆయన.. అప్పటి నుంచి కోమాలోనే ఉన్నారు.


టెరిటోరియల్ ఆర్మీ 160 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్ సెకెండ్ ఇన్ కమాండ్ అయిన కల్నర్ కేబీఎస్ నాట్.. సేవా మోడల్‌ను కూడా గెలుచుకున్నారు. దాదాపు 20 ఏళ్ల సర్వీసు ఉన్న నాట్.. చాలా అనుభవం ఉన్న ఆఫీసర్. 1998లో ఆర్మీలో చేరిన కరణ్‌బీర్ సింగ్.. చెన్నైలోని ఆఫీసర్ ట్రెయినింగ్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా మెకానైజ్డ్ ఇన్‌ఫాంట్రీ రెజ్మింట్‌లో చేరారు. పద్నాలుగేళ్ల సర్వీసు అనంతరం ఆర్మీ నుంచి వైదొలగి.. టెరిటోరియల్ ఆర్మీలో చేరారు.


కుప్వారా జిల్లా హజ్‌నాకా గ్రామంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే నిఘా వర్గాల సమాచారంతో 2015 నవంబరు 17న సైన్యం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఆ ప్రాంతానికి చేరుకుని సోదాలు చేస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పుల జరపడంతో ఎన్‌కౌంటర్‌కు దారితీసింది. ఈ సందర్భంగా ముష్కరుల కాల్పుల్లో నాట్ గాయపడ్డారు. 2015 నవంబరులో కుప్వారాలో వరుస ఎన్‌కౌంటర్‌‌లు చోటుచేసుకున్నాయి. నవంబరు 17న కల్నల్ సంతోష్ మహదిక్ నాయకత్వంలో 41 రాష్ట్రీయ రైఫిల్స్.. కళారూస్ ప్రాంతంలో భారీ ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌‌ను ముందుండి నడిపిన కల్నల్ సంతోష్.. ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు.


ఉగ్రవాదులను గుడిసెలో బంధించిన తర్వాత లెఫ్టినెంట్ కల్నల్ నాట్‌పై కాల్పులు జరిగాయి. ముఖానికి కలాష్నికోవ్ బుల్లెట్ తగిలి తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆపరేషన్ సమయంలో ఆయన తన సహచరులు ముగ్గురిని రక్షించారు. తీవ్రంగా గాయపడిన కల్నల్ నాట్‌ను చికిత్స కోసం ఆర్మీ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో ఢిల్లీకి ఎయిర్‌లిఫ్ట్ చేశారు. శ్రీనగర్ నుంచి ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికి స్పృహ‌లో ఉన్న ఆయన.. క్రమంగా ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. ఆప్పటి నుంచి 8 ఏళ్లుగా కోమాలో ఉన్న ఆయన్ను బతికించడానికి చేయని ప్రయత్నం లేదు. చివరకు ఆదివారం కన్నుమూశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa