ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిన్న కారణానికే రోడ్డుపై దారుణంగా,,,అల్లుడిని హత్య చేసిన అత్తింటివాళ్లు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 27, 2023, 07:44 PM

గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. కుమార్తెను పుట్టింటికి పంపకపోవడంతో ఆమె భర్తను దారుణంగా హత్య చేశారు. కఠెవరంనకు చెందిన పెయింటర్‌ వాసుకు మూడేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆమె పుట్టింటికి వెళ్లలేదు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి యువతి తండ్రి, బంధువులు కొందరు వచ్చి కుమార్తెను పుట్టింటికి పంపాలని అడిగారు. వాసు నిరాకరించడంతో తోపులాట జరిగింది. అనంతరం వారు బంధువులను తీసుకొని వాసు ఇంటి దగ్గర గొడవ పడ్డారు.


వాసు తెనాలి రూరల్ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పాడు. కొంత సమయం వేచి ఉండాలని.. పోలీసులను పంపుతామని సిబ్బంది తెలిపారు. ఈ లోగా సోదరుడు ఫోన్‌ చేసి వచ్చేయమనడంతో వాసు ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో యువతి బంధువులు, వారి మిత్రులు వాసును కొట్టుకుంటూ కొంత దూరం తీసుకెళ్లి కత్తులు, స్కూ డ్రైవర్‌తో దాడి చేయడంతో అతడు చనిపోయాడు. అడ్డుకోబోయిన మేనమామ తిరుపతిరావుపై గొడ్డలితో దాడి చేశారు. నిందితుల్లో పలువురు మద్యం, గంజాయి మత్తులో ఉన్నాట్లు చెబుతున్నారు. దాడి చేసిన వారిలో కొందరు రోజూ గ్రామంలో గొడవలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.


వాసు తల్లికి సుమారు నాలుగు నెలల కిందట పక్షవాతం వచ్చింది. అప్పటి నుంచి వాసు భార్య ఆమెకు సేవలు చేస్తోంది. ఈ విషయం తెలిసిన ఆమె తండ్రి, అతని సోదరుడు సోమవారం రాత్రి వాసు ఇంటికి వచ్చి కుమార్తెను పండగ రోజైనా ఇంటికి పంపితే పది రోజులు ఉండి వస్తుందని అడిగారు. అందుకు వాసు నిరాకరించి వారిపై చేయి చేసుకోవడంతో గొడవ మొదలై హత్యకు దారి తీసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీమ్ ఆధారాలను సేకరించింది. మృతుడి శరీరంపై ఆరు చోట్ల కత్తి పోట్లు, పలు చోట్ల కర్ర దెబ్బలు ఉన్నాయి. నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa