టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా గురువారం గుడుపల్లెలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..... . చిన్నపిల్లల నుంచి యువత వరకు వారి భవిష్యత్తు చూడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉన్నదన్నారు. ‘ఒక్క ఛాన్స్ అడిగితే ఓటేస్తే నాశనం చేశాడు. మళ్లీ ఓటేస్తే గంజాయి, గ్రానైట్, ఇసుక, మాఫియా రాష్ట్రంగా మారిపోతుంది, ఆలోచించండి’ అని హెచ్చరించారు. వెనుకబడిన కుప్పం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఈ నియోజకవర్గాన్ని తాను ఎంచుకున్నానని గుర్తుచేసుకున్నారు. 35 ఏళ్లుగా నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నానని చెప్పారు. ‘నేను అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది. లేనప్పుడు ఎక్కడైనా ఎవరైనా ఒక తట్ట మట్టి వేశారా?’ అని జనాలను ప్రశ్నించారు. కరువులో ఇంటింటికీ రూ.2 కే 20 లీటర్ల స్వచ్ఛమైన నీటిని అందించిన ఘనత టీడీపీకి దక్కిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక, ధరను రూ.5కు పెంచారని, తాము అధికారంలోకి రాగానే మళ్లీ రూ.2 కు అందిస్తామని హమీ ఇచ్చారు.