మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారి సతీందర్‌జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్‌ను కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఉగ్రవాద నిరోధక చట్టం ఉపా (యూఏపీఏ) కింద గోల్డీని ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. అతడిపై ఇప్పటికే ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు, నాన్-బెయిల్‌బుల్ వారెంట్లు జారీ అయ్యాయి. దేశంలో హత్యల కోసం సరిహద్దు అవతల నుంచి డ్రోన్ల ద్వారా హై-గ్రేడ్ ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలను అక్రమంగా రవాణా చేయడంలో అతడి పాత్ర నేపథ్యంలో చర్య తీసుకున్నట్లు ఈ మేరకు కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
నిషేధిత ఉగ్రవాద సంస్థ బాబర్ ఖల్సా ఇంటర్నేషనల్‌తో గోల్డీ బ్రార్‌కు సంబంధాలున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది. సతీందర్‌జిత్ సింగ్, అతడి సహచరులు పంజాబ్‌లో శాంతి, మత సామరస్యం, శాంతిభద్రతలకు విఘాతం, ఉగ్రవాద మాడ్యూళ్లను పెంచడం, టార్గెట్ హత్యలు, ఇతర దేశ వ్యతిరేక కార్యకలాపాల ద్వారా విధ్వంసాలకు కుట్ర పన్నుతున్నారని తెలిపింది.
అతడికి తీవ్రవాదంతో ప్రమేయం ఉందని కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తోందని, అందుకే చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద ఉగ్రవాదిగా చేర్చినట్లు నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో కీలక సభ్యుడిగా పేరుగాంచిన బ్రార్ పంజాబ్‌లోని శ్రీ ముక్త్‌సర్ సాహిబ్‌కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం కెనడాలోని బ్రాంప్టన్‌లో నివసిస్తున్నట్లు సమాచారం. జాతీయ దర్యాప్తు సంస్థ, వివిధ రాష్ట్రాల్లో నేరాలకు సంబంధించి వాంటెడ్‌గా ఉన్నాడు. గత ఏడాది మే 29న పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని మూసా గ్రామం సమీపంలో కారులో వెళ్తోన్న సిద్ధూ మూసేవాలాను కాల్చి చంపారు. మరో గ్యాంగ్‌స్టర్ హత్యకు ప్రతీకారంగా ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు గోల్డీ బ్రార్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో వెల్లడించాడు.