జపాన్‌లోని భూకంపం నింపిన విషాదం నుంచి తేరుకోక ముందే మరో దుర్ఘటన చోటుచేసుకుంది. రాజధాని టోక్య సమీపంలోని హనేడా విమానాశ్రయంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వచ్చిన ఓ విమానం ల్యాండింగ్ తర్వాత.. రన్‌వేపై ఉన్న మరో విమానాన్ని ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి ఉవ్వెత్తున్న ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు క్రూ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ప్రయాణికులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఢీకొట్టిన విమానంలోని మొత్తం 379 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడినట్టు స్థానిక మీడియా నివేదించింది. స్థానిక టెలివిజన్ దీనికి సంబంధించిన ఫుటేజ్‌ను ప్రసారం చేసింది. జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం రన్‌వేపై దిగిన తర్వాత పెద్ద ఎత్తున మంటలు, పొగ వెలువడ్డాయి.
జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం 516.. జపాన్‌లోని షిన్ చిటోస్ విమానాశ్రయం నుంచి హనేడాకు చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఎగిసి పడుతోన్న మంటలను అదుపుచేశారు. రన్‌వేపై నిలిపి ఉంచిన జపాన్ కోస్ట్‌గార్డ్ విమానాన్ని జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం ఢీకొట్టినట్టు స్థానిక మీడియా పేర్కొంది. కాగా ఈ ఘటనపై స్పందించిన జపాన్ కోస్ట్ గార్డ్... ప్రమాద నివేదికలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. జపాన్‌లోని అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటిగా ఉన్న హనేడా. ముఖ్యంగా నూతన సంవత్సర సెలవుల సమయంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.