ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ నిర్ణయం ముఖ్యమంత్రిదే.. అరెస్టైన తమిళనాడు మంత్రికి సుప్రీంలో ఊరట

national |  Suryaa Desk  | Published : Fri, Jan 05, 2024, 10:55 PM

అరెస్టయిన తమిళనాడు మంత్రి వి.సెంథిల్ బాలాజీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ముఖ్యమంత్రి అనుమతి లేకుండా మంత్రిని తొలగించలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆయనను తొలగించాలంటూ ఓ సామాజిక కార్యకర్త చేసిన అభ్యర్థనను ఈ మేరకు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ విషయంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో జస్టిస్ అభయ్ శ్రీవాస్ ఓకా ధర్మాసనం ఏకీభవించింది. అధికార డీఎంకేకు చెందిన మంత్రి బాలాజీని రాష్ట్ర క్యాబినెట్‌లో పోర్ట్‌ఫోలియో లేని మంత్రిగా కొనసాగించాలా? వద్దా? అనేది ముఖ్యమంత్రి నిర్ణయించుకోవాలని హైకోర్టు తన తీర్పులో వెల్లడించింది. దీనిపై సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో కింది కోర్టు తీర్పును సమర్ధించింది.


‘ఒక మంత్రిని తొలగించే అధికారం గవర్నర్‌కు ఉందా లేదా అనే విషయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది.. సంబంధిత వ్యక్తి మంత్రిగా కొనసాగాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకునే బాధ్యతను ముఖ్యమంత్రికి వదిలివేస్తుంది.. ఇందులో జోక్యానికి ఆస్కారం లేదని మేం భావిస్తున్నాం... మద్రాస్ హైకోర్టు అభిప్రాయంతో మేము ఏకీభవిస్తున్నాం.. ఎటువంటి జోక్యం అవసరం లేదు’ అని జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసినప్పటికీ తమిళనాడు ప్రభుత్వంలో బాలాజీ మంత్రిగా కొనసాగవచ్చన్న మద్రాస్ హైకోర్టు నిర్ణయాన్ని సామాజిక కార్యకర్త ఎంఎల్ రవి సవాల్ చేశారు. ప్రజా ధనం ద్వారా లభించే ప్రోత్సాహకాలు, అలవెన్సులను మంత్రి అనుభవిస్తున్నారని, కస్టడీలో ఉన్న వ్యక్తి అధికారిక పని చేయలేరని, బాలాజీని ఎందుకు తొలగించాలో వివరిస్తూ పిటిషన్ దాఖలు చేశారు.


మంత్రి బాలాజీ సెంథిల్‌ను మనీల్యాండరింగ్ కేసులో గతేడాది జూన్ 14న ఈడీ అరెస్ట్ చేసింది. గత అన్నాడీఎంకే ప్రభుత్వంలో రవాణా మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాల కోసం డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలపై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదుచేశారు. ఆగస్టులో మనీలాండరింగ్ విచారణకు సంబంధించి సెంథిల్ బాలాజీ, ఆయన సన్నిహితుల నివాసాల్లో సోదాలు నిర్వహించినప్పుడు ఒక డ్రైవర్ ఇంటి నుంచి ₹ 16 లక్షల కంటే ఎక్కువ విలువైన వస్తువులు, రూ. 22 లక్షల లెక్కలో చూపని నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com