క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, అధిక వేతనాలతో ఉద్యోగాల విషయంలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఒకటైన బాంబే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరోసారి సత్తా చాటింది. ఐఐటీ-బాంబే విద్యార్థుల్లో 85 మంది రూ.కోటికి పైగా వార్షిక వేతనంతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. 2023-24 నియామకాల సీజన్ ఫేజ్-1లో భాగంగా అధిక ప్యాకేజీలను సొంతం చేసుకున్నారు. మొత్తం 1,188 మందికి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ దక్కగా.. వీరిలో 63 మందికి అంతర్జాతీయ ఆఫర్లు వచ్చాయి. అత్యధిక వార్షిక వేతనం రూ.3 కోట్లు. ఐఐటీ బాంబే నిర్వహించిన నియామక ప్రక్రియలో మొత్తం 388 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయి.
మొత్తం 1,340 మంది విద్యార్థులు హాజరుకాగా.. డిసెంబరు 20 వరకూ 1188 మంది కొలువులు సాధించినట్టు అధికారులు తెలిపారు. యాక్సెంచర్, ఎయిర్‌బస్, యాపిల్, బార్‌క్లేస్, గూగుల్, జేపీ మోర్గాన్ చేజ్, మైక్రోసాఫ్ట్, టాటా గ్రూప్ వంటి ప్రఖ్యాత సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. కొన్ని సంస్థలు నేరుగా, మరికొన్ని వర్చువల్‌గా ఇంటర్వ్యూలు నిర్వహించాయి. తమ విద్యా సంస్థలో చదువుతోన్న 60 శాతం మంది విద్యార్థులు ఫేజ్-1లో ఉన్నారని చెప్పారు. 63 మందికి విదేశీ ఆఫర్లు రాగా.. వీటిలో జపాన్, తైవాన్, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, సింగ్‌పూర్, హాంగ్‌కాంగ్ వంటి దేశాలకు చెందిన సంస్థలు ఉన్నాయి.
నియామక ప్రక్రియలో ఇంజినీరింగ్, టెక్నాలజీ విభాగంలో ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. తర్వాతి స్థానాల్లో ఐటీ/ సాఫ్ట్‌వేర్, ఫైనాన్స్/ బ్యాంకింగ్/ ఫిన్‌టెక్, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, డిజైన్ వంటివి ఉన్నాయి. ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు సగటున రూ.21.88 లక్షల ప్యాకేజీని అందుకున్నారు. ఐటీ/ సాఫ్ట్‌వేర్ విద్యార్థులు రూ.26.335 లక్షలు.. ఫైనాన్స్ రూ.32.38 లక్షలు, కన్సల్టింగ్ రూ.18.68 లక్షలు, రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ రూ.36.94 లక్షల చొప్పున సగటు వేతనంతో కొలువులు సాధించారు. ఈ ఏడాది ప్లేస్‌మెంట్స్ కోసం 2 వేల మందికిపైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. తొలి దశలో 60 శాతం మంది హాజరయ్యారు. రెండో దశ వచ్చే నెలలో నిర్వహించనున్నారు.