ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మాయిలు లైంగిక కోరికలు అణుచుకోవాలన్న హైకోర్టు.. సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం

national |  Suryaa Desk  | Published : Fri, Jan 05, 2024, 10:56 PM

బాలికను కిడ్నాప్ చేసి.. ఓ యువకుడు లైంగిక దాడి చేసిన ఘటనకు సంబంధించి కోల్‌కతా హైకోర్టు గతంలో ఇచ్చిన సంచలనమైన తీర్పుపై తాజాగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు.. తీర్పును కొట్టివేసింది. ఈ తీర్పు రాసి వెలువరించిన జడ్జిలు.. అతి ముఖ్యమైన న్యాయ సూత్రాలను పరిగణలోకి తీసుకోలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఉన్నతమైన హోదాల్లో ఉన్న న్యాయమూర్తులు ఇలాంటి సున్నితమైన అంశాలకు సంబంధించిన కేసు తీర్పుల్లో వారి సొంత అభిప్రాయాలను చొప్పించడం సరైంది కాదని తెలిపింది.


టీనేజీ దశలో ఉన్న అమ్మాయిలు తమ లైంగిక వాంఛలను అణచుకోవాలంటూ కొన్ని నెలల క్రితం కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. అయితే ఈ కేసులో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పులోని ప్రతి వ్యాక్యం అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొంది. ఇలాంటి తీర్పులు రాయడం తీవ్రమైన తప్పిదంగా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కీలకమైన న్యాయ సూత్రాలను పరిగణనలోకి తీసుకోకుండానే న్యాయమూర్తులు ఈ కేసు తీర్పు రాశారని విమర్శించింది. న్యాయం అందించాల్సిన హోదాలో ఉన్న న్యాయమూర్తులు తీర్పులకు సొంత అభిప్రాయాలను జోడించడం సబబు కాదని సూచించింది.


పశ్చిమ బెంగాల్‌లో 14 ఏళ్ల బాలికను ఓ యువకుడు కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి పాల్పడిన ఘటనపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ జరిపిన ట్రయల్‌ కోర్టు నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ట్రయల్‌ కోర్టు తీర్పును నిందితుడు కోల్‌కతా హైకోర్టులో అప్పీల్‌ చేశాడు. దీనిపై విచారణ జరిపిన కోల్‌కతా హైకోర్టు 2023 అక్టోబర్‌లో సంచలన తీర్పును చదివి వినిపించింది. టీనేజీ దశలో ఉన్న బాలికలు తమ లైంగిక వాంఛలను అదుపులో పెట్టుకోవాలని.. జస్టిస్‌ చిత్తరంజన్‌ దాస్‌, జస్టిస్‌ పార్థసారథి సేన్‌ల నేతృత్వంలోని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ విస్మయపరిచే తీర్పు చెప్పింది. ఆ 2 నిమిషాల సుఖం కోసం బాలికలు పరాజితులుగా మిగిలిపోకూడదని ఉచిత సలహా కూడా ఇచ్చింది. అంతటితో ఆగకుండా ట్రయల్‌ కోర్టు నిందితుడికి విధించిన 20 ఏళ్ల జైలు శిక్షను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.


అయితే కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పు తమ దృష్టికి రావడంతో గతేడాది డిసెంబర్‌ 8 వ తేదీన సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేసే ఉద్దేశం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా.. లేదా..? తెలియజేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీంతో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును పశ్చిమ బెంగాల్‌ సర్కారు సుప్రీం కోర్టులో సవాల్‌ చేసింది. ఆ పిటిషన్‌పై విచారణను స్వీకరించిన జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం కోల్‌కతా హైకోర్టు తీర్పును పూర్తిగా తప్పుపట్టింది. ఆ తీర్పుపై తమ అభ్యంతరాన్ని వెల్లడిస్తూనే తదుపరి విచారణ జనవరి 12 వ తేదీకి వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com