ఎటువంటి పనిచేయకున్నా... తప్పుడు పత్రాలతో తన ఫ్రెండ్‌ను సంస్థలో నియమించుకుని దాదాపు రూ.10 కోట్లు కాజేశాడు భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి . ఎటువంటి పని చేయకున్నా జీతంతో పాటు ఇతర సదుపాయాలు పొందిన ‘ఘోస్ట్ ఉద్యోగి’ మోసం అమెరికాలో వెలుగు చూసింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన కోర్టు.. నిందితుడు అధికార దుర్వినియోగానికి పాల్పడి సంస్థను మోసం చేసినట్లు నిర్దరించింది. 2019లో వెలుగులోకి వచ్చిన ఈ మోసానికి సంబంధించిన పూర్తి వివరాలను అమెరికా న్యాయశాఖ తాజాగా వెల్లడించింది.
వివరాల్లోకి వెళ్తే.. మిన్నేసోటాలో ఉండే భారత సంతతికి చెందిన కరణ్ గుప్తా.. యునైటెడ్‌హెల్త్ గ్రూప్ అనుబంధ సంస్థ ‘ఆప్టమ్’లో డేటా ఎనలిటిక్స్ సీనియర్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అతడి వార్షిక వేతనం 2.60లక్షల డాలర్లపై మాటే. ఈ నేపథ్యంలో కొన్నేళ్ల కిందట న్యూజెర్సీలో ఉండే తన స్నేహితుడికి అందులో ఉద్యోగం ఇప్పించాలని అనుకున్నాడు. ఉద్యోగానికి సంబంధించిన అర్హతలు అతడికి లేకున్నా నకిలీ పత్రాలను సృష్టించి 2015లో సంస్థలో చేర్చుకున్నాడు. తర్వాత అతడు తన టీమ్‌తోనే పనిచేసేలా మేనేజ్ చేశాడు. ఇక్కడే అతడి ప్లాన్ మొదలైంది. అసలు స్నేహితుడు విధులకు రాకున్నా నెల నెల జీతం అతడి ఖాతాలోకి చేరింది. ఇంక్రిమెంట్‌తో పాటు బోనస్‌లు కూడా అతడికి అందేవి. సంస్థ నుంచి ఉద్యోగిగా వేతనం తీసుకున్నప్పటికీ ఏ ఒక్క సహోద్యోగినీ అతడు కలవలేదు. అతడికి సంబంధించి మెయిల్ కాదుకదా.. తనకు కేటాయించిన కంప్యూటర్లో లాగిన్ కూడా అవ్వలేదు.
ఇలా నాలుగేళ్ల పాటు గడిచిపోయింది. తన ఫ్రెండ్‌కు వచ్చే వేతనంలో సగానికిపైగా గుప్తాకు ఖాతాకే చేరింది. అతడు తన ఖాతా నుంచి నగదు విత్‌డ్రా చేసి గుప్తా అకౌంట్లో డిపాజిట్ చేసేవాడు. నవంబర్ 2019లో గుప్తాను ఓ మోసం కేసులో ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ సమయంలో అతడి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. సంస్థ ఉన్నతాధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాదాపు 1.2 మిలియన్ డాలర్లు సంస్థ సొమ్మును కొళ్లగొట్టడటంతో పాటు, మనీల్యాండరింగ్ మోసానికి పాల్పడినట్టు గుర్తించారు. ఘోస్ట్ ఉద్యోగిని నియమించుకొని సంస్థను మోసం చేసినట్టు కోర్టు నిర్ధరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa