‘స్టాచ్యూ ఆఫ్ యూనియన్’గా గుర్తింపు పొందిన టెక్సాస్ హ్యూస్టన్ నగరంలోని 90 అడుగుల పొడవైన హనుమంతుడి విగ్రహాన్ని ఏర్పాటుపై రిపబ్లికన్ నేత అక్కసు వెళ్లగక్కారు. మూడో ప్రపంచానికి చెందిన ఏలియన్స్ టెక్సాస్‌ను ఆక్రమించుకుంటున్నారు, అమెరికన్లు ఈ దురాక్రమణను అడ్డుకోవాలని సోషల్ మీడియాలో మాగా (మేకిన్ అమెరికన్ గ్రేట్ ఎగైన్) ఉద్యమకారుడైన కార్లోస్ టర్కియోస్ విద్వేషాన్ని చిమ్మారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను షేర్ చేయగా.. తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆయన విదేశీయుల పట్ల ద్వేషాన్ని ప్రోత్సహిస్తున్నారని, అమెరికా సమాజం అభివృద్ధికి వలసదారులు సహకారం అందిస్తున్నారని మండిపడుతున్నారు.
టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్ నగరం సమీపాన షుగర్ ల్యాండ్ అష్టలక్ష్మీ ఆలయం వద్ద 90 అడుగుల ఎత్తైన పంచలోహ అభయాంజనేయ విగ్రహాన్ని 2024లో త్రిదండి శ్రీచిన్నజీయర్ స్వామీజీ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. ఇది అమెరికాలోనే మూడో ఎత్తైన హనుమాన్ విగ్రహం . ఆలయ అధికారులు దీనిని ఈ విగ్రహం బలం, భక్తికి చిహ్నం, శాంతికి ఆధ్యాత్మిక కేంద్రంగా అభివర్ణించారు. కానీ, రిపబ్లికన్ నేత కార్లోస్ టర్కియోస్ విద్వేషాన్ని వెళ్లగక్కారు.
‘‘ఇది ఇండియాలోని న్యూఢిల్లీ.. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ కాదు.. ఇది టెక్సాస్ నగరం షుగర్ ల్యాండ్.. మూడో ప్రపంచ ఏలియన్స్ టెక్నాస్, అమెరికాలను మెల్లగా ఆక్రమించుకుంటున్నారు.. అమెరికాలో మూడో అతిపెద్ద ఈ విగ్రహం ఎందుకు?.. దురాక్రమణను ఆపండి’’ అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో మాగా ఉద్యమనేత పెట్టిన పోస్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విదేశీయుల పట్ల ఆయన విద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారని దుయ్యబడుతున్నారు.
కార్తిక్ గాడ అనే ఓ నెటిజన్ అమెరికాలో మాట్లాడే భాషల చార్ట్‌ను షేర్ చేస్తూ.. ‘అమెరికాలో 41 మిలియన్ల మంది స్పానిష్ మాట్లాడుతారు.. టాప్-10లో భారతీయ భాష ఒక్కటీ లేదు.. ఇంటిలో మాట్లాడే భాష అనేది సమీకరణకు బలమైన సూచిక కాబట్టి, మీ వర్గం భారతీయ-అమెరికన్లతో కలిసే స్థాయికి చేరాలంటే ఇంకా చాలా దూరం వెళ్లాలి.. అమెరికాలో స్పానిష్ మాట్లాడేవారి కంటే భారతీయ భాష మాట్లాడేవారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు సమానులుగా ఇతరులకు చెప్పుకునే హక్కును సంపాదించుకున్నారో లేదో మేము అంచనా వేస్తాం... ఈలోగా, మీరు మరింత వినయంగా ఉండి అమెరికా గురించి మరింత తెలుసుకోవాలని నేను సలహా ఇస్తున్నాను’ కౌంటర్ ఇచ్చారు.
పశ్చిమ దేశాల నాగరికతకు హిందువుల వల్ల ఎలాంటి ముప్పులేదని, కానీ నీలాంటి జాత్యంహకారుల వల్లే, వాస్తవాలను గ్రహించండి అని మరో నెటిజన్ విమర్శించారు. ‘ఏడాదిన్నరగా ఈ విగ్రహం అష్టలక్ష్మీ ఆలయం వద్ద ఉందని, హిందువులు తరుచూ ఇక్కడకు వచ్చి పూజలు చేస్తుంటారని, విగ్రహం వల్లే ఎలాంటి ఇబ్బంది లేదు.. మీ ఇష్టం లేకపోతే దానిని చూడకండి’ మరో యూజర్ దిమ్మదిరిగేలా ట్వీట్ చేశారు. గతంలో టెక్సాస్‌కు చెందిన రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ హనుమ విగ్రహం ఏర్పాటును వ్యతిరేకించారు. క్రైస్తవ దేశంలో ‘కల్పిత హిందూ దేవుడు’ విగ్రహం ఎందుకుని నోరుపారేసుకుని, విమర్శలను ఎదుర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa