ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంత కొట్టినా గృహహింస కాదు: తాలిబన్ సర్కారు నిర్ణయం

international |  Suryaa Desk  | Published : Thu, Feb 19, 2026, 10:41 PM

అఫ్గానిస్థాన్‌లో మహిళల పరిస్థితి మరీ దారుణంగా తయారు అవుతోంది. ముఖ్యంగా అక్కడి ప్రభుత్వమే వారిని తీవ్రంగా అణిచివేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే విద్య, ఉపాధి వంటి ప్రాథమిక హక్కులను కోల్పోయిన అఫ్గాన్ మహిళలపై తాలిబన్లు మరో అమానవీయ చట్టాన్ని ప్రయోగించారు. ఇంట్లో మగవారు మహిళలను, పిల్లలను శారీరకంగా హింసించినా అది నేరం కాదంటూ కొత్త శిక్షాస్మృతిని తీసుకువచ్చారు. తాలిబన్ల సుప్రీం లీడర్ హిబుతుల్లా అఖుంద్జాదా ఈ కిరాతక నిబంధనలపై సంతకం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.


కొత్త నిబంధనల ప్రకారం.. ఇంట్లో పురుషులు మహిళలను లేదా పిల్లలను కొట్టినప్పుడు రక్తస్రావం కానంత వరకు లేదా ఎముకలు విరగనంత వరకు దానిని నేరంగా పరిగణించరు. అంటే భార్యను భర్త శారీరకంగా హింసించే హక్కును ఈ చట్టం కల్పిస్తోంది. ఒకవేళ భర్త క్రూరత్వానికి పాల్పడి ఎముకలు విరిగితే.. బాధితురాలు ఆ విషయాన్ని కోర్టులో నిరూపించగలిగితేనే సదరు పురుషుడికి జైలు శిక్ష విధిస్తారు. అది కూడా కేవలం 15 రోజులే కావడం గమనార్హం. అయితే న్యాయం కోసం కోర్టుకు వెళ్లడం కూడా బాధితురాలికి అగ్నిపరీక్షే. మహిళ కోర్టుకు వెళ్లాలంటే ఆమె వెంట తప్పనిసరిగా సంరక్షుడైన పురుషుడు ఉండాలి. పైగా న్యాయమూర్తికి గాయాలను చూపించేటప్పుడు కూడా ఆమె శరీరం పూర్తిగా కప్పి ఉంచాలనే వింత నిబంధనను విధించారు.


మహిళల స్వేచ్ఛను పూర్తిగా హరించేలా మరికొన్ని నిబంధనలను ఈ కోడ్‌లో చేర్చారు. వివాహిత తన భర్త అనుమతి లేకుండా బంధువుల ఇంటికి వెళ్తే ఆమెకు మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు. గతంలో అంటే 2009లో ఉన్న ప్రజాస్వామ్య ప్రభుత్వం మహిళలపై హింసను నిరోధించేందుకు తెచ్చిన చట్టాలను ఈ కొత్త పీనల్ కోడ్ పూర్తిగా రద్దు చేసింది. కొత్త శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 9 ప్రకారం.. అఫ్గాన్ సమాజాన్ని తాలిబన్లు నాలుగు విభాగాలుగా వర్గీకరించారు. అందులో మొదటిది మత పెద్దలు (ఉల్మా), రెండోది ఉన్నత వర్గం (అష్రాఫ్), మూడోది మధ్య తరగతి, నాలుగోది దిగువ తరగతి.


ఈ వర్గీకరణ ప్రకారం.. నేర తీవ్రతను బట్టి కాకుండా సదరు వ్యక్తి ఏ వర్గానికి చెందినవాడు అనే దానిపై ఆధారపడి శిక్షలు ఉండనున్నాయి. ఇది అఫ్గాన్ సమాజంలో వివక్షను మరింత పెంచే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తాలిబన్ల ఈ అరాచక నిర్ణయాలపై ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మహిళలపై జరుగుతున్న ఈ అణచివేతను అడ్డుకోవాలని, అంతర్జాతీయ సమాజం తక్షణమే జోక్యం చేసుకోవాలని హక్కుల నేతలు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa