బీసీల గురించి, వారి అభ్యున్నతి గురించి మాట్లాడే నైతికత కృష్ణయ్యకు లేదని పెనమలూరు నియోజకవర్గ టీడీపీ బీసీ నాయకులు పీతా గోపీచంద్, సంగెపు రంగారావు, శొంఠి శివరాం ప్రసాద్ విమర్శించారు. పోరంకి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం వారు మాట్లాడుతూ, గురువారం జరిగిన వైసీపీ బీసీ సమావేశంలో ఆర్ కృష్ణయ్య బీసీల బతుకులు మారాయని పలికిన ప్రగల్భాలను తీవ్రంగా ఖండించారు. వేదిక మీదున్న కృష్ణయ్య రాజ్యసభ్యుడయ్యి, అతను మాత్రమే బాగుపడితే బీసీలు బాగుపడినట్లా అని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినటప్పటి నుంచి పనులు లేక బీసీలు అల్లాడుతుంటే నీకు కనిపించలేదా అని ప్రశ్నించారు. బీసీలను వందల మందిని నడిరోడ్లపై వైసీపీ గూండాలు హత్యలు చేస్తుంటే నీకు కనిపించలేదా అని ప్రశ్నించారు. బీసీల న్యాయమయిన హక్కుల కోసం తాము పోరాడుతుంటే నిధులు, విధులు లేని కార్పొరేషన్లు ఇచ్చామనడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. బీసీల బతుకులను జగన్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టిన కృష్ణయ్యకు చంద్రబాబును విమర్శించే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు.