స్వార్థ ప్రయోజనాల కోసమే సీఎం వైయస్ జగన్‌ను చంద్రబాబు విమర్శిస్తున్నారని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలపై బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కౌంటర్ ఎటాక్‌కు దిగారు. చంద్రబాబు ఏం చేస్తాడో చెప్పకుండా, డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతూ జిల్లాలోని ఎమ్మెల్యేలను విమర్శిస్తున్నారని కాటసాని రామిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి.. ఏదో పేపర్ ఇచ్చారని చదివి ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు. రవ్వల కొండ సంపదను టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి దోచుకుంటే మా మీద నెపం వేస్తున్నారు ఎందుకు? అని ప్రశ్నించారు. రవ్వల కొండపై ఉన్న మోడల్ స్కూల్ పిల్లలను.. తలుపుకొట్టి లేసి.. జనార్దన్ రెడ్డి మైనింగ్ బ్లాస్టింగ్ చేసింది వాస్తవం కాదా? అని ఎవరిని అడిగినా చెబుతారని తెలిపారు. గతంలో బీసీ జేఆర్ అనే కాంట్రాక్టు సంస్థను పెట్టుకొని, రవ్వల కొండ, గాలేరు-నగరి, కంకర రాయిని అడ్డంగా దోచుకున్నారని ఆరోపణలు చేశారు. సామాజిక న్యాయం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు.