బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కొనసాగుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తాలో వానలు పడతాయని చెబుతున్నారు. ఇవాళ బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. దక్షణి కోస్తాలోని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. అలాగే రాయలసీమలో కూడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో 24.6 మిల్లీ మీటర్లు, అన్నమయ్య జిల్లా సాంబేపల్లిలో 19.4, అన్నమయ్య జిల్లా చిన్నమండెంలో 16.8, కడప జిల్లా కోడూరులో 14.4, చిత్తూరు జిల్లా పాలసముద్రంలో 10.2, చిత్తూరులో 10, శ్రీసత్యసాయి జిల్లా అమడగూరులో 10, అన్నమయ్య జిల్లా రాయచోటిలో 10 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలతో ఏజెన్సీలోని గ్రామాలు వణికిపోతున్నాయి. దట్టమైన పొగమంచుతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. లంబసింగి, చింతపల్, మినుములూరు, పాడేరులో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సున్నా డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు . మరోవైపు పాడేరు సమీపంలోని వంజంగి మేఘాలకొండలో పర్యాటకులు సందడి చేస్తున్నారు. పొగమంచు చాటున సూర్యోదయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.