సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఊరెళ్లేవారికి ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీలోని సొంతూళ్లకు వచ్చేవారి కోసం ఏపీఎస్ ఆర్టీసీ మరిన్ని ప్రత్యేక బస్సులు నడపడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. తొలుత 6,795 బస్సులు సిద్ధం చేసింది.. వాటిలో హైదరాబాద్ నుంచి వచ్చే వారి కోసమే 1,600 కేటాయించింది. తాజాగా హైదరాబాద్ నుంచి మరో వెయ్యికి పైగా ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు సిద్ధమైంది.
ఈ బస్సులు ఈ నెల 11, 12, 13న ప్రయాణికుల రద్దీ, అడ్వాన్స్ ఆన్‌లైన్ బుకింగ్‌ల ఆధారంగా అవసరమైనన్ని బస్సులను విజయవాడ, కడప, నెల్లూరు జోన్ల నుంచి పంపాలని అక్కడి ఈడీలకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. పండుగ అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యే వారికోసం కూడా మరికొన్ని అదనపు సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. సంక్రాంతికి నడిపే ఆర్టీసీ స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదు. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఆర్టీసీ వసూలు చేస్తున్నారు. సంక్రాంతి కోసం 6,795 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ప్రకటించింది. జనవరి 6 నుంచి 18 వరకూ స్పెషల్ బస్సులను నడపనున్నారు. ప్రయాణీకుల రద్దీ ఎక్కువ కావడంతో నియంత్రించడానికే స్పెషల్ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
సంక్రాంతికి పండుగ రద్దీ దృష్ట్యా పొరుగు రాష్ట్రాలకు కూడా ప్రత్యేక బస్సులు ఆర్టీసీ నడుపుతున్నారు. ఆర్టీసీ వెబ్‌సైట్, టికెట్ బుకింగ్ కేంద్రాల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ సదుపాయం కల్పించారు. రానుపోను టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి 10 శాతం రాయితీ ఇచ్చింది ఆర్టీసీ. అలాగే ఈ నెల 10 నుంచి 13 వరకూ అన్ని సాధారణ సర్వీసులు రిజర్వు అయ్యాయని అధికారులు తెలిపారు.