బిల్కిస్ బానో కేసులో దోషులు పరారీలో ఉన్నట్లు వార్తలు రావడం ప్రస్తుతం తెగ సంచలనం అవుతోంది. 2002 గుజరాత్ అల్లర్ల తర్వాత గర్భిణీగా ఉన్న బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులకు రెమిషన్ మంజూరు చేసిన గుజరాత్ ప్రభుత్వం.. 2022 లో వారిని జైలు నుంచి విడుదల చేసింది. ఆ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేయగా.. తాజాగా జనవరి 8 వ తేదీన.. ఆ నిర్ణయాన్ని పక్కనబెడుతూ సుప్రీం కోర్టు ఇచ్చింది. దోషులను విడుదల చేసే అధికారం గుజరాత్ సర్కార్‌కు లేదని తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు.. రెండు వారాల్లోగా 11 మంది నిందితులు జైల్లో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే 11 మందిలో 9 మంది దోషులు ప్రస్తుతం కన్పించకుండా పోయినట్లు తెలుస్తోంది.
బిల్కిస్ బానో కేసులో ఉన్న 11 మంది దోషులు అందరూ దాహోద్ జిల్లాలోని రాంధిక్‌పుర్, సింగ్వాద్ గ్రామాలకు చెందిన వారని పోలీసులు వెల్లడించారు. 2002 గోద్రా అల్లర్ల నాటి వరకు బిల్కిస్ బానో కుటుంబం కూడా రాంధిక్‌పుర్‌లోనే నివసించేది. అయితే సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు కూడా దోషులంతా ఊర్లోనే కనిపించినట్లు స్థానికులు తెలిపారు. అయితే కోర్టు తీర్పు తర్వాత వారంతా ఇళ్లకు తాళాలు వేసి పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఇక సుప్రీం కోర్టు తీర్పు రాకముందే వారం రోజుల క్రితమే తమ కుమారుడు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు దోషుల్లో ఒకడైన గోవింద్ నాయ్ తండ్రి మీడియాకు వెల్లడించాడు.
అయితే బిల్కిస్ బానో అత్యాచార కేసుకు సంబంధించిన 11 మంది దోషుల్లో 9 మంది దోషులు పరారీలో ఉన్నట్లు వస్తున్న వార్తలపై దాహోద్ జిల్లా ఎస్పీ స్పందించారు. ఇప్పటివరకు తమకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ అందలేదని.. దోషుల లొంగుబాటుపై తమకు ఎలాంటి సమాచారం లేదని వెల్లడించారు. అయితే దోషులు పారిపోయారని ఇప్పుడే అనుమానించలేమని తెలిపారు. కొందరు దోషులు తమ బంధువుల ఇళ్లకు వెళ్లినట్లు తెలిసిందని ఎస్పీ పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ఇచ్చినప్పటి నుంచి శాంతి భద్రతల దృష్ట్యా దోషులు నివసిస్తున్న గ్రామాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు.
2002 లో గోద్రా రైలు దహనం చేసిన తర్వాత గుజరాత్‌లో అల్లర్లు చెలరేగిన సమయంలో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో 5 నెలల గర్భిణీగా ఉన్న బిల్కిస్ బానో కుటుంబంలోని చిన్నపిల్లలతో సహా ఏడుగురిని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఆ తర్వాత గర్భిణీగా ఉన్న బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు 2008 జనవరి 21 వ తేదీన సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పును బాంబే హైకోర్టు సమర్థించింది. ఈ తీర్పుతో 11 మంది దోషులు 15 ఏళ్లు జైలులో శిక్ష అనుభవించారు. అయితే ఈ 11 మంది దోషులకు 2022 లో గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ మంజూరు చేసింది. దీంతో వారంతా 2022 ఆగస్టు 15 వ తేదీన జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. వాటన్నింటినీ కలిపి విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. దోషుల విడుదల చెల్లదని.. 2 వారాల్లోగా వారంతా జైలులో లొంగిపోవాలని తీర్పు వెలువరించింది.