ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయోధ్య ప్రారంభోత్సవానికి వెళ్లేది లేదు.. బీజేపీ, ఆరెస్సెస్‌లపై కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Wed, Jan 10, 2024, 08:55 PM

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్లాలా వద్దా అని డైలమాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చివరికి తేల్చేసింది. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్లేది లేదని స్పష్టం చేసింది. ఈ అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాన్ని బీజేపీ, ఆరెస్సెస్‌లు తమ సొంత కార్యక్రమంగా భావిస్తున్నారని మండిపడింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దేశంలోని ప్రముఖులు, రాజకీయ నేతలు, సాధువులు, క్రీడాకారులు, సినీ హీరో హీరోయిన్లు సహా 7 వేల మందికి ఆహ్వానాలు పంపించింది. అయితే అందులో భాగంగానే కాంగ్రెస్ అగ్రనేతలకు కూడా ఆ ఆహ్వాన పత్రికలను అందించింది. ఈ నేపథ్యంలోనే రామ మందిర ప్రారంభోత్సవానికి హజరు కావడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.


అయోధ్యలో జనవరి 22 వ తేదీన రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరిలకు ఆహ్వానం అందించింది. అయితే వీరు రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలా వద్దా అనే విషయంపై ఇన్ని రోజులు తర్జన భర్జన పడ్డారు. తాజాగా ఆ పార్టీ ఈ విషయంపై స్పష్టతనిచ్చింది. ఈ సందర్భంగా బీజేపీ, ఆరెస్సెస్‌లపై తీవ్ర విమర్శలు చేసింది. బీజేపీ మరియు దాని రాజకీయ గురువు అయిన ఆర్ఎస్ఎస్.. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని ఒక రాజకీయ ప్రాజెక్టుగా చూస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఇక ఈ రామాలయ ప్రారంభోత్సవం బీజేపీ, ఆరెస్సెస్ ఈవెంట్ అని హస్తం పార్టీ అభివర్ణించింది.


ఈ సందర్భంగా అయోధ్య ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందుకున్న మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరీ ముగ్గురు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకావడాన్ని తిరస్కరించినట్లు హస్తం పార్టీ తెలిపింది. మన దేశంలో మతం అనేది వ్యక్తిగత విషయమని.. కానీ ఆరెస్సెస్, బీజేపీలు చాలా కాలంగా అయోధ్యలోని రామాలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చేశాయని దుయ్యబట్టింది. ఇంకా పూర్తిగా నిర్మాణం పూర్తి చేసుకోని అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించి దాని నుంచి రాజకీయంగా లబ్ధిపొందాలని బీజేపీ చూస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు. 2019 సుప్రీం కోర్టు తీర్పుకు కట్టుబడి.. శ్రీరాముడిని పూజించే కోట్లాది మంది భక్తుల మనోభావాలను గౌరవిస్తూ.. మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరిలు స్పష్టంగా ఆరెస్సెస్, బీజేపీ ఈవెంట్‌కు వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించారని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com