అయోధ్యలో దివ్యమైన రామ మందిరం జనవరి 22 వ తేదీన ప్రారంభోత్సవం జరగనున్న విషయం తెలిసిందే. ఇక ఈ మహత్తర కార్యక్రమానికి ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగే జనవరి 22 వ తేదీన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఇక ఆ రోజు యూపీ వ్యాప్తంగా మద్యం షాప్‌లు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు.
అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు జనవరి 22 న సెలవు ప్రకటిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. దీంతోపాటు ఆ రోజున ఉత్తర్‌ప్రదేశ్ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఉండవని స్పష్టం చేశారు. ఇక జనవరి 22 వ తేదీన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ భవనాలను అలంకరించాలని.. బాణాసంచా కాల్చి ఉత్సవాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ఇక రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించి సన్నాహాలను సమీక్షించడానికి అయోధ్యలో పర్యటించిన యోగి ఆదిత్యనాథ్.. అయోధ్యలో పరిశుభ్రత కోసం ‘కుంభ్ మోడల్’ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. జనవరి 14 వ తేదీన అయోధ్యలో పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. అయోధ్య రామమందిరంలో శ్రీరాముడు కొలువుదీరనున్న వేళ.. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం గురించి అధికారులకు సూచనలు చేశారు. వీవీఐపీల విశ్రాంతి స్థలాలను ముందుగానే నిర్ణయించాలని.. ఈ ఉత్సవాలు సజావుగా జరిగేలా చూడాలని తెలిపారు.
జనవరి 22 వ తేదీన అయోధ్య రామాలయంలో రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా 7 వేల మంది ప్రముఖులు హాజరు కానున్నారు. ఇందులో రాజకీయ నాయకులు, బాలీవుడ్ హీరోహీరోయిన్లు, క్రీడాకారులు, బిజినెస్‌మెన్‌లు ఉన్నారు. ఇప్పటికే వారందరికీ ఆహ్వాన పత్రికలు అందాయి.