ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైభవంగా ప్రారంభమైన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 12, 2024, 02:45 PM

శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం నుంచి పంచాహ్నిక దీక్షలతో 7 రోజులపాటు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈరోజు ఉదయం శాస్త్రోక్తంగా స్వామివారి యాగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ఆలయ ఈవో పెద్దిరాజు, అర్చకులు శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ సాయంత్రం ధ్వజారోహణం, ధ్వజపటం ఆవిష్కరించనున్నారు. బ్రహ్మోత్సవాలకు భక్తులకు స్వాగతం పలుకుతూ శ్రీశైలం ముఖద్వారం నుంచి శ్రీశైలం వరకు రహదారి మార్గంలో స్వాగతతోరణాలు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు నుంచి స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు నిర్వహిస్తారు. 13వ తేదీన భృంగివాహనసేవ, 14న రావణవాహనసేవ, 15వ తేదీ మకరసంక్రాంతి పర్వదినం రోజున నందివాహనసేవ, స్వామి, అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కల్యాణం, 16వ తేదీన కైలాసవాహనసేవ, 17 వతేదీన యాగపూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూలస్నానం, సదస్యం, నాగవల్లి, ధ్వజావరోణ కార్యక్రమాలు, 18 వ తేదీన రాత్రి జరిగే పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవలతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఈ నెల 12 నుంచి 18 వరకు ఆర్జిత, ప్రత్యక్ష, పరోక్షసేవలైన రుద్రహోమం, చండీహోమం, మృత్యుంజయహోమం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం, స్వామి, అమ్మవార్ల కల్యాణం, ఏకాంతసేవలను నిలుపుదల చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com