ఏపీలో కౌలు రైతులకు సంబంధించి ప్రభుత్వం ఎస్ఎల్బీసీ సమావేశంలో చర్చించింది. రాష్ట్రంలో 2023-24కు 3 లక్షల మంది కౌలురైతులకు రుణాలు అందించాలనే లక్ష్యంగా ఉండగా.. గత సెప్టెంబరు వరకు 75 వేల మందికే బ్యాంకులు రుణాలు అందించాయి. అయితే లక్ష్యంలో 25 శాతమే సాధించాయి అంటున్నారు. రైతులకు స్వల్పకాలిక పంట రుణాల కింద ఖరీఫ్, రబీ కలిపి రూ.1.48 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా.. ఖరీఫ్‌లో 56% లక్ష్యాన్ని సాధించినట్లు ఎస్ఎల్బీసీ (రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ) తెలిపింది. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు, కౌలు రైతులకు రుణాల మంజూరులో బ్యాంకులు లక్ష్యాలను సాధించాలన్నారు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రాష్ట్రంలో ఈ ఏడాది 3 లక్షల మందికి పైగా కౌలురైతులకు రూ.4 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా.. ఇప్పటివరకు 75 వేల మందికి పైగా రుణాలు అందించారు. వీరికి మరింత తోడ్పాటును అందించాలని కోరారు. టిడ్కో గృహాలకు రుణాలు అందించాలని.. విద్యారుణాల మంజూరులోనూ ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలన్నారు. పీఎం ముద్ర యోజన లాంటి కేంద్రపథకాలు, ఇతర ప్రాయోజిత కార్యక్రమాలకు బ్యాంకులు పూర్తిగా తోడ్పాటు అందించాలన్నారు. నాలుగేళ్లుగా బ్యాంకుల వార్షిక రుణప్రణాళిక లక్ష్యాల సాధనలో వృద్ధిరేటు కనిపిస్తోందన్నారు
విద్య, వైద్యరంగాల్లో మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి బ్యాంకులు తోడ్పాటును అందిస్తాయన్నారు యూబీఐ ఈడీ నితీష్ రంజన్. వ్యవసాయరంగానికి స్వల్పకాలిక పంటరుణాల కింద ఖరీఫ్, రబీ కలిపి రూ.1.48 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా.. ఖరీఫ్‌లో రూ.82,329 కోట్లు అందించి 56% లక్ష్యాన్ని సాధించినట్లు ఎస్ఎల్బీసీ కన్వీనర్, యూబీఐ మేనేజర్ రవీంద్రబాబు చెప్పారు. 2023-24 బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళిక మేరకు రుణాల మంజూరులో గత సెప్టెంబరు వరకు సాధించిన ప్రగతిని వివరించారు. వ్యవసాయ టర్మ్ రుణాలు రూ.68వేల కోట్లు ఇవ్వాలి ఉండగా.. రూ.43,400 కోట్లు ఇచ్చామని తెలిపారు. ఫార్మా క్రెడిట్‌కు రూ.2.16లక్షల కోట్లు అందించాల్సి ఉండగా.. 58%శాతం (రూ.1.25లక్షల కోట్లు) ఇచ్చామన్నారు. ఎంఎస్ఎంఈ రంగానికి రూ.69వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. రూ.53,208 కోట్లు (78%) అందించామన్నారు. రైతులకు రూ.లక్ష నుంచి రూ.లక్షా 60 వేల వరకు రుణాలు అందిస్తున్నాయి బ్యాంకులు.